ఎలక్ట్రానిక్స్‌కు ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయ్‌..

23 Jun, 2020 04:13 IST|Sakshi

మలేసియా, తైవాన్‌ల వైపు చూడొచ్చు

చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోవచ్చు: డబ్ల్యూటీసీ నివేదిక

ముంబై: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులను భారత్‌ నిజంగానే తగ్గించుకోదల్చుకుంటే ప్రత్యామ్నా య మార్కెట్లు చాలానే ఉన్నాయని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ముంబై (డబ్ల్యూటీసీ) వెల్లడించింది. సింగపూర్, మలేసియా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతులను పెంచుకునే అంశం పరిశీలించవచ్చని పేర్కొంది. డబ్ల్యూటీసీ గణాంకాల ప్రకారం చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు, టీవీ సెట్లు ఉంటున్నాయి.

చమురుయేతర  ఉత్పత్తుల దిగుమతుల్లో చైనాకు 14% వాటా ఉంటోంది. ‘2019 ఏప్రిల్‌ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలం లో మొత్తం ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగుమతుల విలువ రూ.3.59 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువ సుమారు రూ. 1.42 లక్షల కోట్లు.. అంటే దాదాపు మొత్తం దిగుమతుల్లో 40% వాటా’ అని డబ్ల్యూటీసీ తెలిపింది. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతుల్లో అత్యధిక వాటా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులదే (కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక దిగుమతులు, కంప్యూటర్, ఐటీ హార్డ్‌వేర్, మొబైల్‌ ఫోన్స్‌ మొదలైనవి) ఉంటోంది.  

మొబైల్‌ దిగుమతులు తగ్గినా.. చైనాదే హవా..
గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్‌ ఫోన్ల దిగుమతులు మొత్తం మీద తగ్గినప్పటికీ చైనా వాటా మాత్రం పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్‌ – 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో సెల్‌ ఫోన్‌ దిగుమతులు సగానికి సగం పడిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని రూ. 11,304 కోట్ల నుంచి రూ. 6,313 కోట్లకు క్షీణించాయి. దేశీయంగా తయారీ పెరగడం, హ్యాండ్‌సెట్స్‌పై దిగుమతి సుంకాలు పెంచడం ఇందుకు కారణం. అయితే, చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గినప్పటికీ మొత్తం దిగుమతుల్లో దాని వాటా 55 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది.  

దేశీయంగా ఉత్పత్తికి ఊతం...  
కేంద్రం ఇటీవల కొన్నాళ్లుగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పలు స్కీములను అమలు చేస్తోంది. దీంతో 2014–2020 మధ్య కాలంలో దేశీయంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ 20.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.73 లక్షల ఓట్లుగా ఉన్న స్థానిక ఉత్పత్తి 2019–20లో రూ. 5.33 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్‌ పరిస్థితులు చూస్తే ఇది మరింత వేగంగా వృద్ధి చెందనుందని డబ్ల్యూటీసీ అంచనా వేసింది. అయితే, దేశీయంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగే దాకా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకునే క్రమంలో ఇతర మార్కెట్లవైపు చూడవచ్చని తెలిపింది. సింగపూర్, అమెరికా, మలేసియా, జపాన్‌ నుంచి ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు, కలర్‌ టీవీ సెట్లను, సింగపూర్, తైవాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్‌ నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు