11 రెట్లు పెరిగిన ఇండియా సిమెంట్స్‌ లాభం

28 Jan, 2017 01:48 IST|Sakshi
11 రెట్లు పెరిగిన ఇండియా సిమెంట్స్‌ లాభం

పెరిగిన అమ్మకాలు, తగ్గిన ఉత్పత్తి వ్యయాలు
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్‌ నికర లాభం(స్టాండోలోన్‌)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 11 రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.3 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ3లో రూ.35 కోట్లకు పెరిగిందని ఇండియా సిమెంట్స్‌ తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండడం, అమ్మకాలు అధికంగా ఉండడం వల్ల ఈ స్థాయి లాభాలు వచ్చాయని కంపెనీ వైస్‌ చైర్మన్, ఎండీ, ఎన్‌. శ్రీనివాసన్‌  చెప్పారు. మొత్తం ఆదాయం రూ.1,066 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.1,271 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా, మంచి ఫలితాలే సాధించామని చెప్పారు.

క్లింకర్, ఎగుమతులతో కూడా కలుపుకొని మొత్తం సిమెంట్‌ అమ్మకాలు 19 లక్షల టన్నుల నుంచి 22 శాతం వృద్ధి చెంది 24 లక్షల టన్నులకు చేరాయని వివరించారు.  మరిన్ని విదేశీ మార్కెట్లలో ప్రవేశించనున్నామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల రుణాలు చెల్లించామని, దీంతో టర్మ్‌ రుణభారం రూ.1,900 కోట్లకు తగ్గిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.250 కోట్లు రుణాలు చెల్లించాలని యోచిస్తున్నామని, ఇప్పటికే రూ.180 కోట్లు చెల్లించామని వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే నికర లాభం రూ.142 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.79 కోట్ల నికర లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,521 కోట్ల నుంచి రూ.3,791 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
 

>
మరిన్ని వార్తలు