భారత మార్కెట్‌ సవాళ్లమయం.. 

2 May, 2019 00:21 IST|Sakshi

దీర్ఘకాలికంగా మాకు కీలకం 

రిటైల్‌ స్టోర్స్‌ ఏర్పాటు, తయారీ పెంచుకోవడంపై దృష్టి 

యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ 

న్యూయార్క్‌: దీర్ఘకాలికంగా తమకు కీలకమైనదిగా భావిస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా మాత్రం భారత మార్కెట్‌లో చాలా సవాళ్లున్నాయని ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు రిటైల్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేయడం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి చర్యలతో భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘దీర్ఘకాలికంగా భారత్‌ మాకు చాలా కీలకమైన మార్కెట్‌గా భావిస్తున్నాం. స్వల్పకాలికంగా మాత్రం ఇక్కడ చాలా సవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే వీటిని అధిగమించడమెలాగన్నది నేర్చుకుంటున్నాం. భారత్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాల్లో కొన్ని మార్పులు చేశాం.

ప్రాథమికంగా అవి కాస్త మెరుగైన ఫలితాలే ఇస్తున్నాయి‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కుక్‌ చెప్పారు. భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌ సెగ్మెంట్‌లో తీవ్రమైన పోటీ కారణంగా గత నెలలో యాపిల్‌ తమ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ రేటును ఏకంగా 22 శాతం తగ్గించింది. అలాగే దేశీయంగా తయారీ కూడా ప్రారంభించిన యాపిల్‌.. క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. భారత్‌లో రిటైల్‌ స్టోర్స్‌ ఏర్పాటు కోసం అనుమతులు పొందేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామని కుక్‌ తెలిపారు. భారత మార్కెట్లో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధిపత్యం ఉంటుండటంపై స్పందిస్తూ.. తమ సంస్థ ఎదగడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయనడానికి దీన్ని నిదర్శనంగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు.  

లాభం 16 శాతం డౌన్‌.. 
2019 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో యాపిల్‌ లాభం 16% క్షీణించింది. 11.56 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. అటు ఆదాయం కూడా అయిదు శాతం తగ్గి 58 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు