సెన్సెక్స్‌ తొలి నిరోధం 34,220

22 Jun, 2020 06:30 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా, ఇండో–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, గతవారం పెద్ద ఎత్తున జరిగిన షార్ట్‌ కవరింగ్‌ ప్రభావంతో దేశీయ మార్కెట్‌ హఠాత్‌ ర్యాలీ జరిపింది. ప్రధాన కార్పొరేట్‌ రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌ వరుస పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షిస్తున్నతీరు, రూ.1,620 సమీపంలో ట్రిపుల్‌టాప్‌ను ఆ షేరు ఛేదించిన శైలిని పరిశీలిస్తే....ఈ జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపులోపు మరింత పెరిగే  అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ షేరుకు సూచీల్లో వున్న అధిక వెయిటేజి కారణంగా మార్కెట్‌ర్యాలీ కూడా కొనసాగే ఛాన్సుంది. అలాగే గత శుక్రవారం వడ్డీ ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఆటో,  రియాల్టీ షేర్లు కూడా ర్యాలీలో పాలుపంచుకున్నందున, అనూహ్య పరిణామాలేవీ చోటుచేసుకోకపోతే.... ఇప్పటికే బాగా పెరిగివున్న ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లు బలహీనంగా ట్రేడయినా, భారత్‌ సూచీలు  మరికొంతశాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక సాంకేతిక అంశాలకొస్తే....  

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
జూన్‌ 19తో ముగిసినవారం ప్రధమార్థంలో 32,923 పాయింట్ల వరకూ తగ్గిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌...ద్వితీయార్థంలో జోరుగా ర్యాలీ సాగించి 34,848 పాయింట్ల గరిష్టస్థాయికి ర్యాలీ జరిపింది.  
చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 951 పాయింట్ల భారీ లాభంతో 34,732 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్‌ట్రెడ్‌ కొనసాగితే సెన్సెక్స్‌ తొలుత 34,930 పాయింట్ల స్థాయిని  అధిగమించాల్సివుంటుంది. అటుపైన వేగంగా 35,260 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 35,920 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. సెన్సెక్స్‌ ఈ ఏడాది జనవరి20న సాధించిన  42,274 పాయింట్ల రికార్డు గరిష్టం నుంచి మార్చి 24 నాటి 25,639 పాయింట్ల కనిష్టస్థాయివరకూ  జరిగిన పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 35,920 పాయింట్ల వద్ద  రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు గట్టి అవరోధం కలగవచ్చు. ఈ స్థాయిని  ఛేదిస్తే రానున్న కొద్దిరోజుల్లో  36,950 పాయింట్ల వద్దకు   పెరగవచ్చు. ఈ వారం తొలి అవరోధస్థాయిని అధిగమించలేకపోయినా,  బలహీనంగా మొదలైనా 34,135 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 33,370 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున తిరిగి 32,920 పాయింట్ల స్థాయిని  పరీక్షించవచ్చు.

నిఫ్టీ తొలి నిరోధం 10,330
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అనూహ్యంగా 10,272 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపి. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 272 పాయింట్ల లాభంతో 10,244 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం  అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే నిఫ్టీ 10,330 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది.  ఈ స్థాయిని దాటితే 61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 10,550 పాయింట్ల వరకూ ర్యాలీ  
జరిగే  ఛాన్స్‌ వుంటుంది. ఈ స్థాయి వద్ద ఎదురుకాబోయే గట్టి నిరోధాన్ని సైతం అధిగమిస్తే క్రమేపీ 10,750 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోయినా,  బలహీనంగా మొదలైనా 10,070  పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ
మద్దతు దిగువన ముగిస్తే 9,845 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 9,725 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.   
– పి. సత్యప్రసాద్‌
 

>
మరిన్ని వార్తలు