హిప్‌.. హిప్‌.. స్టార్టప్‌!

6 Nov, 2019 04:23 IST|Sakshi

ఈ ఏడాది 1,100 స్టార్టప్‌లు

అయిదేళ్లలో మొత్తం 9,300 ఏర్పాటు

మూడో అతి పెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా కొనసాగుతున్న భారత్‌

నాస్కామ్‌ నివేదికలో వెల్లడి

బెంగళూరు: స్టార్టప్‌ వ్యవస్థకు సంబంధించి భారత్‌ మూడో అతి పెద్ద దేశంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్‌ ఏర్పాటయ్యాయి. దీంతో గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సుమారు 8,900–9,300 స్థాయికి చేరినట్లయిందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ మంగళవారం వెల్లడించింది. గతేడాది టెక్‌ స్టార్టప్‌ల సంఖ్య సుమారు 7,800–8,200 దాకా ఉంది. ఇదే ఊపు కొనసాగితే 2014–2025 మధ్య కాలంలో భారత స్టార్టప్‌ వ్యవస్థ 10 రెట్లు వృద్ధి నమోదు చేయగలదని పేర్కొంది.ఇక 2025 నాటికి యూనికార్న్‌ల (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ గల స్టార్టప్‌లు) సంఖ్య దేశీయంగా 95–105 శ్రేణిలో ఉండొచ్చని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ తెలిపారు.

2014లో 10–20 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న స్టార్టప్‌ వ్యవస్థ వేల్యుయేషన్‌ 2025 నాటికి 350–390 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరగలదని, 10 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని ఆమె పేర్కొన్నారు. ‘భారత స్టార్టప్‌ వ్యవస్థ వృద్ధి ఒక అద్భుత గా«థ. ప్రభుత్వం, పరిశ్రమ మద్దతుతో మరింత వేగంగా 10 రెట్లు వృద్ధి సాధించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి‘ అని ఘోష్‌ వివరించారు. 16వ నాస్కామ్‌ ప్రోడక్ట్‌ సదస్సులో కార్యక్రమంలో దేశీ టెక్నాలజీ స్టార్టప్‌ వ్యవస్థపై నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.

స్టార్టప్‌ల కేంద్రంగా బెంగళూరు ..
సంఖ్యాపరంగా అత్యధిక టెక్నాలజీ స్టార్టప్‌లతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ తర్వాత స్థానంలో ఉంది. కొత్తగా వస్తున్న టెక్‌ స్టార్టప్‌ల్లో 12–15 శాతం సంస్థలు వర్ధమాన నగరాల నుంచి ఉంటుండటం గమనార్హం. స్టార్టప్స్‌లోకి గతేడాది 4.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఈ ఏడాది ఇప్పటిదాకా 4.4 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని ఘోష్‌ చెప్పారు.

గతేడాది 17గా ఉన్న యూనికార్న్‌ల సంఖ్య ఈసారి 24కి పెరిగిందని, ఏడాది ముగిసేలోగా మరో 2–3 కొత్తగా జతవ్వొచ్చని వివరించారు. గతేడాది టెక్‌ స్టార్టప్‌లు ప్రత్యక్షంగా 40,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1.6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కలి్పంచాయని చెప్పారు. ఈ ఏడాది 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1.3–1.8 లక్షల పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగిందని ఘోష్‌ వివరించారు. దేశీ స్టార్టప్‌లకు మార్కెట్, నిధుల లభ్యతపరమైన సవాళ్లు ఉంటున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు