ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా భారత్‌: అంబానీ

24 Feb, 2020 14:41 IST|Sakshi

ఈ దశాబ్దాన్ని రిలయన్స్‌-మైక్రోసాప్ట్‌  భాగస్వామ్యం నిర్దేశిస్తుంది

మన తరువాతి తరం విభిన్నమైన భారతాన్ని  చూడనుంది - అంబానీ  

మూడద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్నాం 

సాక్షి, ముంబై: భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశం ఎంతో దూరంలో లేదని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్పష్టం చేశారు.  మూడు రోజుల పర్యటన నిమిత్తం  భారత్‌కు వచ్చిన మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో  ముచ్చటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ముంబైలో జరిగిన ఫ్యూచర్ డీకోడ్ సీఈఓ 2020 సమ్మిట్‌లో  సత్య నాదెళ్లతో సంభాషించిన అంబానీ డిజిటల్‌ సేవల్లో భారత్‌ అగ్రగామిగా నిలవనుందని చెప్పారు.  2014 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్‌ ఇండియా పిలుపుతో దేశంలో డిజిటల్‌ విప్లవానికి పునాది పడిందని తెలిపారు.  

ముఖ్యంగా జియో ఆవిష్కారం అనంతరం భారత్‌లో డిజిటల్‌ విప్లవాన్ని తీసుకొచ్చామన్నారు. రిలయన్స్‌ జియో ద్వారా దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా డేటా సౌకర్యాన్ని అందించగలగడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. జియోకు ముందు దేశంలో డేటా వేగం 256 కేబీపీఎస్‌ అయితే, జియో తరువాత ఇది 21 ఎంబీపీస్‌గా ఉండడం విశేషమన్నారు. 380 మిలియన్ల మంది జియో 4జీ టెక్నాలజీకి వలస వచ్చారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో భారతదేశం "ప్రీమియర్ డిజిటల్ సొసైటీ" గా అవతరించే దశలో ఉందన్నారు. అలాగే  ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థలలో  ఒకటిగా భారత్‌ నిలవనుందని అంబానీ పేర్కొన్నారు. ఇందులో తనకెలాంటి సందేహం లేదనీ, అయితే ఇది రానున్న ఐదేళ్లలోనా, పదేళ్లలో జరుగుతుందా అనేదే చర్చ అన్నారు. రిలయన్స్‌, మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం ఈ దశాబ్దాన్ని నిర్వచించనుందన్నారు. ఇది చాలా కీలమని ఆయన పేర్కొన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రస్తుత దేశ పర్యటన గురించి ప్రస్తావించిన అంబానీ, అమెరికా మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్,  బరాక్ ఒబామా సందర్శనల కంటే భారతదేశం చాలా భిన్నంగా ఉందని, మొబైల్ కనెక్టివిటీ ఒక కీలకమైన మార్పు అని తెలిపారు. తరువాత తరం మీరు(సత‍్య నాదెళ్ల) నేను( ముకేశ్‌ అంబానీ) చూసిన భారత్‌ కంటే విభిన్నమైన  దేశాన్ని  చూడబోతోందన్నారు.(చదవండి: భారత సీఈవోలకు సత్య నాదెళ్ల సలహా)

మైక్రోసాప్ట్‌,  భాగస్వామ్యాన్ని ప్రకటించిన ముకేశ్‌ అంబానీ రానున్న దశాబ్దాన్ని ఈ డీల్‌ నిర్వచించనుందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని ప్రతి వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ లేదా బిల్ గేట్స్ అయ్యే అవకాశం ఉందని అంబానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా  సత్య నాదెళ్ల నేతృత్వంలో  మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న సేవలను అంబానీ ప్రశంసించారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు