ఆ నలుగురిలో గెలిచేది ఎవరు?

27 Jun, 2016 12:33 IST|Sakshi
ఆ నలుగురిలో గెలిచేది ఎవరు?

న్యూఢిల్లీ : తదుపరి ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వం కూడా అభ్యర్థుల  జాబితాను కుదించడంతో  భారీ ఉత్కంఠ నెలకొంది. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా కొనసాగరని  స్పష్టం కావడంతో   రాజన్ వారసుడి  ఎంపికపై  అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఎంపికలో తన అభ్యర్థుల జాబితాను కుదించినట్టు  సీనియర్  అధికారి రాయిటర్స్ కి చెప్పారు.  కొత్త ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ)కూడా త్వరలో గవర్నర్ ను ఎంపిక చేస్తుందని తెలిపారు. ప్రధానంగా నలుగురు అభ్యర్థుతో కూడిన  జాబితాను  ఎంపిక చేశామన్నారు. వీరిలో ముగ్గురు కేంద్ర బ్యాంకు మాజీ, ప్రస్తుత  ఉన్నతోద్యోగులు  కాగా,  మరొకరు స్టేట్ బ్యాంక్   చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య .  ప్రస్తుత ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్  ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గవర్నర్ రేసులో ఉన్నారు.

ఒకవైపు  ఎస్ బీఐ  అధిపతి అరుంధతి భట్టాచార్య  ఈ పదవికి ఎంపిక కావడం ఖాయమనే ఊహాగానాలు  జోరుగా సాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం షార్ట్ లిస్ట్  చేసిన జాబితాలో కూడా ఈమె పేరు ప్రముఖంగా ఉండడంతో ఇవి మరింత  ఊపందుకున్నాయి. మరోవైపు దేశ ఉన్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అధిపతిగా అరుంధతి ఎంపిక పై వస్తున్న ఊహాగానాలపై నెటిజన్లు దాదాపు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమెకు అంత అర్హత లేదనీ, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో  ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే దక్షత,  నైపుణ్యంలేవని  వాదిస్తున్నారు. ఒకవేళ  ఆర్ బీఐ అత్యున్నత పదివికి  అరుంధతి భట్టాచార్య ఎంపిక అయితే ..అరవింద సుబ్రమణియన్, శక్తికాంత్  దాస్లపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ, సీనియర్ నేత   సుబ్రహ్మణ్య స్వామి  ఎలా స్పందిస్తారు?  ఈ నేపథ్యంలో గవర్నర్ రేసు పై  అంతకంతకూ సస్పెన్స్ పెరుగుతోంది. మరి దీనికి  తెరపడాలంటే  తుది నిర్ణయం  కోసం వేచి  చూడాల్సిందే..

కాగా ప్రస్తుత  గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం ఈ  సెప్టెంబర్ లో ముగియనుండటం,అటాగే బ్రెగ్జిట్  పరిణామాల నేపథ్యంలో మార్కెట్లను బలమైన సంకేతాలను అందించాలనే ఉద్దేశంతో  ఈ ప్రక్రియ వేగవంతమైంది.  అటు తను రెండవసారి ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగనని   రాజన్ స్పష్టం చేయడంతో   కేంద్ర బ్యాంకు ఉన్నత  పదవిని అధిరోహించే అభ్యర్థుల రేస్ మొదలైంది.  వీరిలో  బలంగా  వినిపించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి   శక్తికాంత్ దాస్ పేర్లను తొలగించడం విశేషంగా మారింది.

మరిన్ని వార్తలు