భారత్‌కు ఇంకాస్త మంచి రేటింగ్‌ ఇవ్వొచ్చు

12 Jun, 2020 06:35 IST|Sakshi

సీఈఏ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌

న్యూఢిల్లీ: భారత్‌కు మరింత మంచి రేటింగ్‌ ఇవ్వవచ్చని చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు, ద్రవ్యోల్బణం, కరెంట్‌ అకౌంట్‌లోటు, రుణ భారం వంటి పలు భారత ఆర్థిక ప్రాథమిక అంశాలు రేటింగ్‌ పెంపునకు తగిన విధమైన పటిష్టతతో ఉన్నాయని గురువారం విలేకరులతో అన్నారు. జూన్‌ ప్రారంభంలోనే భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ (సావరిన్‌ రేటింగ్‌) రేటింగ్‌ ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’ కి మూడీస్‌ తగించడం, ఇక బుధవారం మరో అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– ఎస్‌అండ్‌పీ భారత్‌ రేటింగ్‌ను ‘బీబీబీ–’గానే  (రెండు సంస్థల రేటింగ్‌– ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి జంక్‌ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ) కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం వంటి అంశాలు సీఈఏ ప్రకటన నేపథ్యం. రేటింగ్‌ల విషయంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నిర్ణయాల తర్వాత ఇందుకు సంబంధించి ప్రభుత్వంలో కీలక అధికార స్థాయి నుంచి వచ్చిన స్పందన ఇది.  సుబ్రమణ్యన్‌ అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

► రుణ పునః చెల్లింపులకు సంబంధించి భారత్‌ సామర్థ్యం ఎంతో పటిష్టంగా ఉంది.  
► భారత్‌ ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలను అందిస్తాయని సూచిస్తాయని రేటింగ్‌ సంస్థలు, భారత్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ అధిక వృద్ధి బాటకు మళ్లుతుందని అంచనాలు వేస్తున్న సంగతి గమనార్హం.
► భారత్‌ ‘ఠి’ (వీ షేప్డ్‌– వేగవంతమైన ఆర్థిక రికవరీకి సంకేతం) నమూనా రికవరీ సాధిస్తుందనడంలో సందేహం లేదు. స్పానిష్‌ ఫ్లూ తరువాత ఇదే తరహా పరిస్థితి కనిపించింది.  
► ఆర్థిక వ్యవస్థలో రికవరీపై ఈ ఏడాది వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది రెండవ భాగం నుంచైనా రికవరీ ఉంటుందా? లేదా వచ్చే ఏడాదే ఇక ఇది సాధ్యమవుతుందా? అన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది.  
► అయితే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తగిన అన్ని చర్యలూ తీసుకోవడంపై ఆర్థిక వ్యవస్థ కసరత్తు చేస్తోంది. అలాగే ద్రవ్యలోటు కట్టడికీ ప్రయత్నిస్తుంది.  
► ప్రైవేటైజేషన్‌ విధానం విషయంలో బ్యాంకింగ్‌ వ్యూహాత్మక రంగంగా ఉంది.
► మొండిబకాయిల పరిష్కారానికి ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ ఏర్పాటు అంతగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు