ముందు బ్యాంకింగ్‌ సవాళ్లను ఎదుర్కొనాలి!

9 Jun, 2018 01:01 IST|Sakshi

భారత్‌కు ఐఎంఎఫ్‌ సలహా

అప్పుడే పెట్టుబడుల పురోగతి, సమగ్ర వృద్ధి సాధ్యమని విశ్లేషణ  

వాషింగ్టన్‌: భారత్‌ మొదట బ్యాంకింగ్‌ రంగ సవాళ్లను అధిగమించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. పెట్టుబడులకు ఊతమివ్వటానికి, సమగ్ర అభివృద్ధికి ఇదెంతో కీలకమని విశ్లేషించింది. రెండు వారాలకు ఒకసారి నిర్వహించే విలేకరుల సమావేశంలో ఐఎంఎఫ్‌ ప్రతినిధి గ్యారీ రైస్‌ మాట్లాడుతూ, భారత్‌ బ్యాంకింగ్‌ సవాళ్లపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన జవాబుల్లోని ముఖ్యాంశాలు చూస్తే...
     
మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గించడానికి భారత అధికారులు తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి విజయవంతం కూడా అవుతున్నట్లు సంకేతాలున్నాయి. మొండిబకాయిల గుర్తింపు, దివాలా చట్టం పరిధిలో కేసుల సత్వర పరిష్కారం వంటి చర్యలు బ్యాంకింగ్‌ సమస్యల పరిష్కార దిశలో ఉన్నాయి. ఈ చర్యలు తొలిదశలోనే ఉన్నప్పటికీ, ప్రోత్సాహకర పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయా అంశాల్లో పూర్తి విజయవంతమైన ఫలితాలు సాధించినతర్వాత, పాలనాపరమైన వ్యవహారాల్లో ప్రత్యేకించి రిస్క్‌ మేనేజ్‌మెంట్, కార్యకలాపాల్లో సంస్కరణల అమలు, లక్ష్యాల సాధన భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కీలకం. ఇక  బ్యాంకులకు తగిన మూలధనం అందించాలన్న అధికారుల సంకల్పం హర్షణీయం. 

ప్రస్తుత పరిస్థితి ఇదీ...
బ్యాంకులకు 2017–18, 2018–19కు గాను కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో రూ. 65,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించారు. ఈ డబ్బు మూలధనానికి సంబంధించి రెగ్యులేటరీ అవసరాలకు తప్ప రుణ వృద్ధికి దోహదపడబోదని  మూడీస్‌ పేర్కొనగా, బ్యాంకులు ప్రకటించిన భారీ నష్టాల కారణంగా...  ఇప్పటికే సమకూర్చిన రూ.65 వేల కోట్ల అదనపు మూలధనం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని రేటింగ్స్‌ ఏజెన్సీ ఫిచ్‌ విశ్లేషించించడం గమనార్హం.  

మరిన్ని వార్తలు