నగదు రహిత ఎకానమీకి చాలా దూరంలో: నీలేకని 

14 Mar, 2019 00:40 IST|Sakshi

న్యూఢిల్లీ: నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు మనం చాలా దూరంలోనే ఉన్నామని ఇన్ఫోసిస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, డిజిటల్‌ చెల్లింపులపై ఆర్‌బీఐ కమిటీ చైర్మన్‌ అయిన నందన్‌ నీలేకని అన్నారు. డిజిటల్‌ చెల్లింపులను మరింత ఆమోదనీయంగా మార్చేందుకు ఈ వ్యవస్థ చుట్టూ ఉన్న భద్రతా సంబంధిత అంశాలను పరిష్కరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన 2019 ఇండియా ఫోరం ఫర్‌ పీసీఐ సెక్యూరిటీ స్టాండర్స్‌ కౌన్సిల్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నీలేకని ప్రసంగించారు. గత కొన్ని సంవత్సరాల్లో కార్డులు, పీవోఎస్‌ రూపంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగినట్టు చెప్పారు. ‘‘నగదు తక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థగా మారేందుకు మనం చాలా దూరంలోనే ఉన్నాం. నగదు చాలా సౌకర్యం కావడమే దీనికి కారణం.

ఎవరైనా నగదు స్వీకరిస్తారు. పైగా దీనికి ఎటువంటి లావాదేవీ చార్జీ ఉండదు. లావాదేవీల సంఖ్యలో సెక్యులర్‌ పెరుగుదలనే మనం చూస్తున్నాం. కార్డుల చెల్లింపుల వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చాలి. లావాదేవీల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో తక్కువ సెక్యూరిటీ సమస్యలు, తక్కువ మోసాలు, తక్కువ వివాదాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని వివరించారు. ఉన్న సదుపాయాల నడుమ వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించడంతోపాటు, మరింత మందిని డిజిటల్‌ చెల్లింపుల వైపు నడిపించడమనేది వాస్తవిక సవాలుగా నీలేకని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు