భారత్‌లో తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌

12 Mar, 2020 11:42 IST|Sakshi

రూపొందించిన సెలెస్ట్రియల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ను హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సెలెస్ట్రియల్‌ ఈ–మొబిలిటీ రూపొందించింది. వినియోగానికి వీలున్న నమూనాను బుధవారమిక్కడ ఆవిష్కరించింది. ఉద్యానవనాలు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు రవాణాకు వీలుగా 6 హెచ్‌పీ సామర్థ్యంతో తయారు చేశారు. 21 హెచ్‌పీ డీజిల్‌ ట్రాక్టరుకు సమానంగా ఇది పనిచేస్తుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ దురైరాజన్‌ మీడియాకు తెలిపారు. ‘ధర రూ.5 లక్షల లోపు ఉంటుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా అందుకోవచ్చు. డీజిల్‌ ట్రాక్టరుతో గంటకు రూ.150 ఖర్చు వస్తే, దీనికి రూ.20–35 మధ్య ఉంటుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వేగం గంటకు 20 కిలోమీటర్లు. 5–8 ఏళ్లు బ్యాటరీ మన్నికగా ఉంటుంది. నెలకు 100 ట్రాక్టర్ల తయారీ సామర్థ్యంతో బాలానగర్‌లో ఫ్యాక్టరీ ఉంది. రూ.60 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని వివరించారు.

మరిన్ని వార్తలు