ఫారెక్స్‌ నిల్వలు  @ 420.05 బిలియన్‌ డాలర్లు 

18 May, 2019 00:20 IST|Sakshi

ముంబై: భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌ రిజర్వ్స్‌) మే10వ తేదీతో ముగిసిన వారంలో 1.36 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 420.05 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో 171.9 మిలియన్‌ డాలర్లు పెరిగి 418.68 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 1.35 బిలియన్‌ డాలర్లు పెరిగి 392.22 బిలియన్‌ డాలర్లకి చేరాయి.

(అమెరికా డాలర్‌ మినహాయించి మిగిలిన కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్‌ వంటి ఇతర నిల్వల పెరుగుదల/తరుగుదలను డాలర్లలోనికి మార్చి లెక్కించడాన్నే ఎఫ్‌సీఏగా వ్యవహరిస్తారు.) బంగారం నిల్వలు ఎటువంటి మార్పులులేకుండా 23.021 బిలియన్‌ డాలర్ల వద్ద ఉండగా.. అంతర్జాతీయంగా ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) వద్ద ఉన్న స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 3 మిలియన్‌ డాలర్లు పెరిగి 1.454 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఫండ్‌తో నిల్వల స్థితి 7 మిలియన్‌ డాలర్లు పెరిగి 3.35 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. విదేశీ మారక నిల్వలు గతేడాది ఏప్రిల్‌ 13న 426.028 బిలియన్‌ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు