టాప్‌ 3 ఎకానమీల్లోకి భారత్‌

25 Feb, 2020 08:28 IST|Sakshi

దశాబ్దకాలంలో సాధ్యమే

డిజిటల్‌ సొసైటీగా ఎదుగుతాం

టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుస్తుంది

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో ప్రపంచంలోని టాప్‌ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌..  కచ్చితంగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ డిజిటల్‌ సమాజంగా భారత్‌ రూపొందుతుందని ఆయన చెప్పారు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుస్తుందన్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘ప్రపంచంలోని టాప్‌ 3 ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతుందనడంలో నాకెలాంటి సందేహం లేదు. ఇందుకు అయిదేళ్లు పడుతుందా లేక పదేళ్లు పడుతుందా అన్నది చెప్పలేము కానీ.. కచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది. అప్పటికల్లా మన దేశం సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందినదిగా ఉంటుందా? అభివృద్ధి పనుల్లో టెక్నాలజీ వాడకం ఎలా ఉంటుంది? టెక్నాలజీ వినియోగం విషయంలో మనం మిగతా వాళ్లకు దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉండగలమా? ఇలాంటి విషయాలను మనం తేల్చుకోవాలి.  ప్రపంచంలోనే ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా ఎదిగేందుకు భారత్‌ ముందు అద్భుతమైన అవకాశం ఉంది. మనం అస్త్రశస్త్రాలన్నీ అందిపుచ్చుకుని ముందుకు దూసుకెళ్లడమే తరువాయి‘ అని అంబానీ చెప్పారు.

300 బిలియన్‌ డాలర్ల నుంచి ..3 ట్రిలియన్‌ డాలర్లకు..
సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు భారత ఎకానమీ పరిమాణం 300 బిలియన్‌ డాలర్లుగా ఉండేదని.. ప్రస్తుతం ఇది 3 ట్రిలియన్‌ డాలర్లకు ఎగిసిందని ముకేశ్‌ అంబానీ చెప్పారు. టెక్నాలజీ ఊతంతోనే ఇది సాధ్యపడిందన్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టాక పురోగతి మరింత వేగవంతం అయిందన్నారు. ‘జియో రాక ముందు దేశీయంగా డేటా ఖరీదు జీబీకి రూ. 300 నుంచి రూ. 500 దాకా ఉండేది. 2జీ ఫోను ఉపయోగించే అత్యంత సామాన్యుడికైతే ఏకంగా రూ. 10,000 దాకా జీబీ ధర ఉండేది. కానీ జియో వచ్చిన తర్వాత ఇది జీబీకి రూ. 12–14 స్థాయికి తగ్గిపోయింది. గడిచిన మూడేళ్లలో 38 కోట్ల మంది కస్టమర్లు 4జీ టెక్నాలజీకి మారారు. సగటు నెట్‌ స్పీడ్‌ 256 కేబీపీఎస్‌ నుంచి ఇప్పుడు 21 ఎంబీపీఎస్‌కు చేరింది‘ అని ఆయన తెలిపారు.

ట్రంప్‌ చూస్తున్నది.. నవ భారతం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనను కూడా అంబానీ ప్రస్తావించారు. గతంలో వచ్చిన అమెరికా అధ్యక్షులు కార్టర్‌ గానీ బిల్‌క్లింటన్‌.. ఆఖరుకు ఇటీవలి బరాక్‌ ఒబామా కూడా చూడని ఒక కొత్త భారత్‌ను ట్రంప్‌ నేడు చూస్తున్నారని ఆయన చెప్పారు. రిలయన్స్‌ వ్యవస్థాపకుడు, తండ్రి ధీరూభాయ్‌ అంబానీ అప్పట్లో ఒక టేబులు, కుర్చీ, చేతిలో రూ. 1,000 పెట్టుబడితో ప్రారంభించిన స్టార్టప్‌ సంస్థ నేడు దిగ్గజంగా వృద్ధి చెందిందని తెలిపారు. చిన్న వ్యాపారస్తులైనా.. ధీరూభాయ్‌ లేదా బిల్‌గేట్స్‌ స్థాయికి ఎదిగేందుకు భారత్‌లో పుష్కలమైన అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయని తెలియజెప్పడానికి ఇది నిదర్శనంగా అంబానీ వివరించారు.

నాదెళ్లపై ప్రశంసలు..
మైక్రోసాఫ్ట్‌కి సత్య నాదెళ్ల సారథ్యం వహించడం ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమని అంబానీ చెప్పారు.

సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవాలి
ముంబై: సమ్మిళిత వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెట్టాలని, సొంతంగా సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల భారతీయ సంస్థలకు సూచించారు. గత దశాబ్దంలో మొబైల్‌ ద్వారా స్మార్ట్‌ టెక్నాలజీలు విరివిగా వాడకంలోకి వచ్చాయన్నారు. అయితే, అగ్రిగేటర్‌ సంస్థలు మాత్రమే దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందాయని పేర్కొన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ నిర్వహించిన ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సీఈవోల సదస్సులో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. టెక్నాలజీ భవిష్యత్తు, భారతీయ కంపెనీలతో కలిసి మైక్రోసాఫ్ట్‌ పనిచేసే తీరుతెన్నులు మొదలైన వాటి గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘మనం ఏదైనా టెక్నాలజీని రూపొందించినప్పుడు.. సమ్మిళిత ఆర్థిక వృద్ధికి అది ఏవిధంగా ఉపయోగపడుతుందన్నది కూడా దృష్టిలో ఉంచుకోవాలి‘ అని నాదెళ్ల పేర్కొన్నారు. నాయకత్వ హోదాల్లో ఉన్న సంస్థలు ఓవైపు సాంకేతిక సామర్థ్యాలను నిర్మించుకుంటూనే మరోవైపు టెక్నాలజీపరమైన మార్పులను సాధ్యమైనంత త్వరగా అందిపుచ్చుకోవాలని చెప్పారు. గడిచిన దశాబ్దంలో వినియోగదారుల వ్యయాల ధోరణులే ప్రధానమన్న రీతిగా ఎకానమీ నడిచిందని.. కానీ ఆర్థిక వ్యవస్థ అంటే అదొక్కటే కాదని నాదెళ్ల తెలిపారు. టెక్నాలజీని వివిధ ప్రక్రియల్లో విరివిగా వాడే కంపెనీలన్నీ కూడా ప్రైవసీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం మొదలైన అంశాల్లో సంబంధిత వర్గాల విశ్వాసం చూరగొనే విధంగా వ్యవహరించాలని సూచించారు. 

మారుతున్న టెక్నాలజీ ఉద్యోగాల తీరు..
సాంకేతిక రంగంలో ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోతున్నాయని, కొంగొత్త నైపుణ్యాల్లో ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతుండటం కీలకంగా మారిందని ఆయన చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో సుమారు 72 శాతం ఉద్యోగాలు.. టెక్నాలజీయేతర కంపెనీల్లోనే ఉంటున్నాయన్న నెట్‌వర్కింగ్‌ సైట్‌ లింక్డ్‌ఇన్‌ డేటా ఇందుకు నిదర్శనమని చెప్పారు.  పిరమల్‌ గ్లాస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి కంపెనీల్లో సాంకేతికత వినియోగాన్ని నాదెళ్ల ప్రస్తావించారు. రిలయన్స్‌తో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం .. రాబోయే దశాబ్దంలో అత్యంత కీలకమైనదిగా ఆయన అభివర్ణించారు.

మరిన్ని వార్తలు