పసిడి.. డిమాండ్‌ ఢమాల్‌!

31 Jan, 2020 05:09 IST|Sakshi

2019లో 9 శాతం తగ్గుదల

భారత్‌పై ప్రపంచ స్వర్ణ మండలి నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: ధరల తీవ్రతతో భారత్‌లో బంగారం డిమాండ్‌ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్‌ తగ్గడానికి దారితీసిందని మండలి పేర్కొంది. మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపిన సమాచారం ప్రకారం– నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...

► 2018లో దేశంలో బంగారం డిమాండ్‌ 760  టన్నులు. 2019లో 690 టన్నులకు పడింది.  
► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, డిమాండ్‌ 598 టన్నుల నుంచి 544 టన్నులకు దిగింది.  
► కడ్డీలు, నాణేల డిమాండ్‌ 10 శాతం తగ్గి 162.4 టన్నుల నుంచి 146 టన్నులు చేరింది.
► 2019 అక్టోబర్‌ 25న వచ్చిన దంతేరాస్‌లో కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. దేశీయంగా పసిడి ధరల తీవ్రత, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు దీనికి కారణం.  
► అయితే విలువ పరంగా మాత్రం భారత్‌ పసిడి డిమాండ్‌  రూ.2,11,860 కోట్ల నుంచి రూ.2,17,770 కోట్లకు పెరగడం గమనార్హం.  
►  చైనా తర్వాత పసిడి డిమాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో 2020లో ఈ మెటల్‌ డిమాండ్‌ 700 నుంచి 800 టన్నుల మధ్య ఉండవచ్చన్నది అంచనా. ప్రభుత్వం తీసుకునే పలు చర్యలతో ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండడం దీనికి కారణం.  
► 2019 ప్రారంభంలో ముంబై స్పాట్‌ మార్కెట్‌లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.32,190 ఉంటే, సంవత్సరం చివరకు వచ్చే సరికి రూ.39,000పైన ముగిసింది. ఒక దశలో రూ.40,000 మార్క్‌ను దాటడం కూడా గమనార్హం.  
► బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్‌ మార్క్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం జనవరిలో నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్‌ మార్క్‌ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయా అంశాలు పసిడిని దేశంలో మరింత విశ్వసనీయ మెటల్‌గా పెంపొందిస్తాయి.  
►  అయితే పసిడికి స్వల్పకాలంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పరిశ్రమలో లాభాలు తగ్గడం, పన్నుల అనిశ్చితి వంటివి ఇందులో ఉన్నాయి.  
► 2019లో దేశ పసిడి దిగుమతులు స్మగ్లింగ్‌సహా 14% తగ్గి 756 టన్నుల నుంచి 647 టన్నులకు పడింది. స్మగ్లింగ్‌ 115–120 టన్నులు ఉంటుందని అంచనా. 2020లో డిమాండ్‌లు పెద్దగా పెరిగే అవకాశం లేదు.  
► కస్టమ్స్‌ సుంకం ప్రస్తుతం 12.5 శాతం ఉంటే ఇది 10 శాతానికి తగ్గే అవకాశం ఉంది.  
► దేశ పసిడి డిమాండ్‌లో 60 శాతంపైగా గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం గమనార్హం. ఇక్కడ ఆభరణాలను సాంప్రదాయక సంపదగా భావిస్తుండడం దీనికి కారణం.

ప్రస్తుతం దేశంలో రూ. 40వేల పైనే...
పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ముంౖ»ñ æసహా దేశంలోని పలు ప్రధాన మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.40,000పైనే కొనసాగుతోంది. గురువారం ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో ధర రూ.210 పెరిగి రూ.41,790కి చేరింది. న్యూఢిల్లీలో రూ.400 ఎగసి రూ.41,524కు చేరింది. అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా సమీప కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, చైనా కరోనా వైరస్‌ నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా పసిడివైపు ఇన్వెస్టర్లు చూస్తుండడం గమనార్హం. గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు ఒకానొకదశలో 10 డాలర్లు పెరిగి 1,580 డాలర్లను తాకింది. 

మరిన్ని వార్తలు