భారత్‌ డిమాండ్‌ బంగారం!

9 Mar, 2017 00:50 IST|Sakshi
భారత్‌ డిమాండ్‌ బంగారం!

2020 నాటికి 950 టన్నులకు అప్‌  
ప్రపంచ స్వర్ణ మండలి అంచనా  


ముంబై: భారత్‌ పసిడి డిమాండ్‌ 2020 నాటికి 950 టన్నులకు చేరుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ఆర్థికవృద్ధి, పసిడి మార్కెట్‌లో పారదర్శకత పసిడికి దేశంలో డిమాండ్‌ను గణనీయంగా పెంచుతాయని డబ్ల్యూజీసీ నివేదిక బుధవారం పేర్కొంది.  గత ఏడాదిగా పసిడి డిమాండ్‌ తగ్గుతూ వస్తున్నా... భవిష్యత్‌లో తిరిగి రికవరీ అవుతుందని వివరించింది. కరెంట్‌ అకౌంట్‌ లోటు ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని పసిడికి డిమాండ్‌ను తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఆయా ప్రయత్నాలు ఫలించబోవని వివరించింది.  సమాజంలో ఈ మెటల్‌ పట్ల ఉన్న ఆకర్షణే దీనికి కారణమని తెలిపింది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే...

డిమాండ్‌ మళ్లీ పుంజుకుంటుంది. 2017లో డిమాండ్‌ 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉండవచ్చు. అయితే 2020 నాటికి మాత్రం 850 టన్నుల నుంచి 950 టన్నులకు చేరే వీలుంది.

ప్రస్తుతం పసిడి డిమాండ్‌ తగ్గడానికి డీమోనిటైజేషన్‌ ప్రభావం కూడా ఉంది.

మేము 2016 మొదటి త్రైమాసికంలో ఒక వినియోగ సర్వే నిర్వహించాం. కరెన్సీలతో పోల్చితే, పసిడి పట్ల తమకు ఎంతో విశ్వాసం ఉందని 63 శాతం మంది భారతీయులు ఈ సర్వేలో తెలిపారు. దీర్ఘకాలంలో పసిడే తమ భరోసాకు పటిష్టమైనదని 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ విశ్వాసాలను డీమోనిటైజేషన్‌ మరింత పెంచింది.

ప్రజలు ఒకసారి డిజిటల్‌ పేమెంట్లకు అలవాటు పడినప్పుడు, ఈ ధోరణి పసిడి కొనుగోళ్లు పెరగడానికీ దోహదపడుతుంది. ఆర్థికవృద్ధి, పారదర్శకత అంశాలు ఇక్కడ పసిడి డిమాండ్‌ పెరగడానికి దోహదపడే అంశాలు.

ఫిబ్రవరిలో మూడింతల దిగుమతులు..
కాగా పెళ్లిళ్ల సీజన్‌ పసిడి డిమాండ్‌ భారీగా ఉందని ఫిబ్రవరిలో ఆ మెటల్‌ దిగుమతులు వివరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.  ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోల్చిచూస్తే 175 శాతం పెరిగి 96.4 మెట్రిక్‌ టన్నులకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ గడచిన 11 నెలల కాలంలో విదేశీ కొనుగోళ్లు 32 శాతం పెరుగుదలతో 595.5 టన్నులకు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో– ఆభరణాలకు ఏప్రిల్‌లో భారీ డిమాండ్‌ ఉంటుందని తాము భావిస్తున్నట్లు గీతాంజలి జమ్స్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మెహుల్‌ చోక్సీ పేర్కొన్నారు.

ఈ ఏడాది డిమాండ్‌ 725 టన్నులు: సిటీగ్రూప్‌
మరోవైపు, 2017లో పసిడి డిమాండ్‌ వార్షికంగా పుంజుకుంటుందని ఆర్థిక సేవల సంస్థ– సిటీగ్రూప్‌ కూడా విశ్లేషించింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ను  దీనికి కారణంగా వివరించింది.

అంతర్జాతీయంగా నెల కనిష్ట స్థాయి...
అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్లు వార్తలు, దీనితో మార్చి 14–15 సమావేశాల సందర్భంగా అమెరికా  ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీరేటును (ప్రస్తుతం 0.50 శాతం) పెంచుతుందన్న ఊహాగానాలు పసిడికి అంతర్జాతీయ మార్కెట్‌లో నైమెక్స్‌లో నెల కనిష్ట స్థాయికి చేర్చాయి. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్‌ (31.1గ్రా)కు 1,205 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రెండు వారాల్లో పసిడి దాదాపు 40 డాలర్లు తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన స్పాట్‌ మార్కెట్‌ ముంబైలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర బుధవారం రూ.29 వేల దిగువన ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు