7% వృద్ధి రేటు అనుమానమే!

27 Mar, 2019 00:01 IST|Sakshi

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌  రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్య

గణాంకాలపై సందేహాలు తొలగాలని వ్యాఖ్య

ఇందుకు నిష్పాక్షిక కమిటీ అవసరమనీ సూచన

న్యూఢిల్లీ: భారత్‌ ఏడు శాతం వృద్ధి రేటు సాధనపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి గణాంకాలపై ఉన్న సందేహాలను తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తగిన ఉద్యోగాల కల్పన జరగని పరిస్థితుల్లో 7 శాతం వృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గణాంకాల విషయంలో నెలకొన్న అనుమానాలను తొలగించడానికి నిష్పక్షపాత కమిటీ ఏర్పాటు అవసరమనీ ఆయన సూచించడం గమనార్హం. భారత్‌ వాస్తవ వృద్ధిని కనుగొనడానికి గణాంకాల మదింపు ప్రక్రియ  పునర్‌వ్యవస్థీకరణ అవసరం అన్నారు. సెప్టెంబర్‌ 2013 నుంచి సెప్టెం బర్‌ 2016 వరకూ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన రాజన్, తాజాగా ఒక వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

∙నాతో ఇటీవల ఒక మంత్రి (పేరు వెల్లడించలేదు) మాట్లాడారు.  తగిన ఉపాధి కల్పన లేనప్పుడు మనం ఎలా 7 శాతం వృద్ధి సాధించగలమని ఆయన అడిగారు. ఈ కారణాన్ని చూపిస్తే, మనం ఏడు శాతం వృద్ధిని సాధించే అవకాశం కనపించడం లేదు. 

∙వృద్ధి రేట్ల సమీక్ష అనంతరం, ఆయా గణాంకాల పట్ల అనుమానాలు పెరిగాయి. వీటిమీద సందేహాలు తొలగాలి. ఇందుకు సంబంధించి నిష్పాక్షిక కమిటీ ఏర్పడాలి. గణాంకాల పట్ల విశ్వాసం మరింత పెరగాలి. (2018 నవంబర్‌లో కేంద్ర గణాంకాల శాఖ కాంగ్రెస్‌ హయాంలోని యూపీఏ కాలంలో జీడీపీ వృద్ధిరేట్లను తగ్గించింది. మోదీ పాలనలో గడచిన నాలుగేళ్ల జీడీపీ వృద్ధి రేట్లను యూపీఏ కాలంలో సాధించిన వృద్ధిరేట్లకన్నా ఎక్కువగా సవరించింది). 

∙వివాదాస్పద పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్‌) వంటి తన నిర్ణయాల వల్ల జరిగిన మంచి చెడులను ప్రభుత్వం సమీక్షించి, మున్ముందు ఎటువంటి తప్పులూ జరక్కుండా చూసుకోవాలి. 

మరిన్ని వార్తలు