ఐదేళ్లకో ప్రణాళిక.. 5వ స్థానానికి చేర్చింది

26 Jan, 2019 02:55 IST|Sakshi

ఎన్నో ప్రత్యేకతలతో ఎదుగుతున్న భారత్‌

లైసెన్స్‌ రాజ్‌ నుంచి డిజిటల్‌ వ్యవస్థ స్థాయికి

రూ.947 కోట్ల నుంచి 167 లక్షల కోట్లకు జీడీపీ

ఫోర్బ్స్‌ కుబేరుల్లో టాప్‌–5లో భారతీయుడు

9వ అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌ మనదే

డెబ్భై ఏళ్లు!!. ఒక పూర్తి జీవితం!!. వెనక్కి 
తిరిగి చూసుకుంటే బాల్యం నుంచి జరిగిన ఘటనలు అన్నీ ఇన్నీ కావు. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇదే సమయంలో... ఊహకందనన్ని జీవితాల్ని చూసిందను కోవాలి. కేవలం రూ.947 కోట్లతో మొదలైన ప్రస్థానం... ఇపుడు ఏకంగా రూ.167 లక్షల కోట్లకు చేరింది. సగటు భారతీయుడి తలసరి ఆదాయాన్ని రూ.247 నుంచి రూ.1.12 లక్షలకు తీసుకెళ్లింది. 
పంచవర్ష ప్రణాళికలతో మొదలుపెట్టి... వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలు, సేవలు... ఇలా అన్ని రంగాలకూ ప్రాధాన్య మిచ్చుకుంటూ... సంక్షోభాల్ని తట్టుకుని, సంస్కరణలకు ప్రాణం పోసి ఇపుడో మహాశక్తిగా ఎదిగింది. ఈ ఏడు దశాబ్దాల పయనంపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది...

స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)
కేవలం రూ.947 కోట్ల ఆర్థిక వ్యవస్థను మనకు బ్రిటిష్‌ వారు అప్పగించి వెళ్లగా... అదిప్పుడు రూ.167 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. స్వాతంత్య్రం వచ్చాక స్వల్ప వృద్ధికి కూడా కటకటలాడే ఆర్థిక వ్యవస్థ 2005–06 నాటికి ఏకంగా రెండంకెల వృద్ధికి ఎగబాకింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత వృద్ధి రేటు నెమ్మదించి నప్పటికీ, 2014 నుంచి (2017 మినహా) ప్రపంచంలో అత్యంత వేగంగా 7 శాతం వృద్ధిని సాధిస్తున్న దేశంగా భారత్‌ అవతరించగలిగింది. ఈ 70 ఏళ్లలో భారతీయుడి వార్షిక తలసరి ఆదాయం రూ.247 నుంచి రూ.1.12 లక్షలకు చేరింది. ఇక రిజర్వుబ్యాంకు వద్ద 1950లో కేవలం 2 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలుండేవి. అలాంటిదిపుడు 400 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలుండే స్థాయికి చేరింది.

పంచవర్షం నుంచి నీతి ఆయోగ్‌కు...
బుడిబుడి అడుగులేసే పిల్లల ఎదుగుదలకు ప్రణాళిక వేసినట్లుగా.. ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపడానికి 1951లో పంచవర్ష ప్రణాళికలు ఆరంభమయ్యాయి. యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడటం వంటి కారణాలతో 1967– 1969 సంవత్సరాల మధ్య పంచవర్ష ప్రణాళికలు అమలు కాలేదు. 1978–79, 1990–91, 1991–92లో మూడు సార్లు వార్షిక ప్రణాళి కలను అమలు చేశారు. ప్రస్తుత 2012–2017 పంచవర్ష ప్రణాళిక 12వది. కాగా తాజాగా ఏర్పాటైన నీతి ఆయోగ్‌ మూడేళ్ల యాక్షన్‌ ప్లాన్‌ను ప్రతిపాదించింది. 

సంక్షోభాలను తట్టుకుంటూ...
ఈ 70 ఏళ్లలో మన ఆర్థిక వ్యవస్థ 3సంక్షోభాల్ని చవి చూసింది. అవి 1966, 1981, 1991 సంవత్స రాల్లో. ఈ మూడూ కూడా విదేశాలకు చెల్లింపులు చేయలేక తలెత్తిన సంక్షోభాలే. దివాలా దేశంగా ప్రకటితమయ్యే సందర్భాలవి. అలాంటి సందర్భాల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) డాలరు రుణాన్ని సర్దుబాటు చేయడంతో తక్షణ చెల్లింపులు చేయగలిగాం. 1991లో తలెత్తిన సంక్షోభానికి  రిజర్వు బ్యాంకు తన దగ్గరున్న 67 టన్నుల బంగారాన్ని ఐఎంఎఫ్‌ వద్ద తనఖా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1991లో సంక్షోభ ఫలితంగా 1992లో ఆర్థిక సంస్కరణలు ఆరంభమయ్యాయి. అవి కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయి. మన మానవ వనరుల సమర్థ వినియోగానికి దారులు వేశాయి. అంతే!! ఆ తరవాత మళ్లీ సంక్షోభ ఛాయలు భారత్‌ను తాకలేదు. 

గ్యాస్‌... ఫోన్‌... సంస్కరణల చలవే!
1992 వరకు ఏదైనా వ్యాపారం నడపాలంటే ప్రతి దానికీ లైసెన్సులు లేదా పర్మిట్లు తప్పనిసరి పద్ధతి నడిచింది. 1992లో రూపాయి విలువను ఒకే నెలలో మూడు దఫాలు తగ్గించడం ద్వారా మొదలైన ఆర్థిక సంస్కరణలు.. లైసెన్స్‌ రాజ్‌కు తెరవేశాయి. పలు కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచాయి. అప్పటిదాకా ఇంట్లో గ్యాస్‌ కనెక్షన్‌ కావాలంటే సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి. టెలిఫోన్‌ శ్రీమంతులకే సాధ్యం. ప్రయివేటు పెట్టుబడులకు ద్వారాలు తెరవటంతో పోటీతత్వం పెరిగింది. తక్షణం కావాల్సిన గ్యాస్‌ కనెక్షన్‌ రావటమే కాదు.. ఫోన్‌ కనెక్షన్లను ఇంటికొచ్చి మరీ ఇచ్చే పరిస్థితులొచ్చాయి. 1990 దశకం తొలినాళ్లలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావంతో భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ వృద్ధిచెందింది.  లిస్టెడ్‌ కంపెనీల  విలువ రూ.150 లక్షల  కోట్లకు చేరడంతో భారత్‌ స్టాక్‌ మార్కెట్‌  9వ పెద్ద స్టాక్‌ మార్కెట్‌గా ఎదిగింది. 

ఆర్థిక సంస్కరణలకు ముందు...
కారు లేదా స్కూటర్‌ కొనాలంటే వాటిని బుక్‌ చేసుకున్న రెండు, మూడేళ్లకుగానీ డెలివరీ వచ్చేది కాదు. మన కంపెనీల వద్ద ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండటం, ప్రభుత్వం ఉత్పత్తిపై పరిమితులు విధించడం ఇందుకు కారణం. వైద్యానికైనా, విహారానికైనా, వ్యాపారానికైనా విదేశాలకు వెళ్లాలంటే విదేశీ మారక ద్రవ్యం కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తప్పనిసరి అయ్యేది. ఆర్‌బీఐ దగ్గర తగిన డాలర్లు లేకపోవడంతో పరిమిత విదేశీ ద్రవ్యానికే అనుమతినిచ్చేది.విదేశాల నుంచి కారు గానీ, కంప్యూటర్‌గానీ, కనీసం వైద్య పరికరాన్ని దిగుమతి చేసుకోవాలన్నా భారీగా 200 నుంచి 300 శాతం వరకూ దిగుమతి సుంకాలుండేవి. 

ఆర్థిక సంస్కరణలకు తర్వాత..
కారు లేదా స్కూటర్‌ కొనాలంటే వాటిని బుక్‌ చేసుకున్న రెండు, మూడేళ్లకుగానీ డెలివరీ వచ్చేది కాదు. మన కంపెనీల వద్ద ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండటం, ప్రభుత్వం ఉత్పత్తిపై పరిమితులు విధించడం ఇందుకు కారణం. వైద్యానికైనా, విహారానికైనా, వ్యాపారానికైనా విదేశాలకు వెళ్లాలంటే విదేశీ మారక ద్రవ్యం కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తప్పనిసరి అయ్యేది. ఆర్‌బీఐ దగ్గర తగిన డాలర్లు లేకపోవడంతో పరిమిత విదేశీ ద్రవ్యానికే అనుమతినిచ్చేది.విదేశాల నుంచి కారు గానీ, కంప్యూటర్‌గానీ, కనీసం వైద్య పరికరాన్ని దిగుమతి చేసుకోవాలన్నా భారీగా 200 నుంచి 300 శాతం వరకూ దిగుమతి సుంకాలుండేవి. గత 25 సంవత్సరాల్లో తలసరి ఆదాయం 500 డాలర్ల నుంచి 1600 డాలర్లకు మూడు రెట్లకుపైగా పెరిగింది. రానున్న 25 ఏళ్లలో తలసరి ఆదాయం 10,000 డాలర్లకు పెరుగుతుందని అంచనా. విదేశీ మారక నిల్వలు దాదాపు జీరో నుంచి 400 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

పాలించిన బ్రిటన్‌కంటే...
ఏ దేశం నుంచైతే మనం స్వాతంత్య్రం సంపాదించుకున్నామో.. ఆ దేశం.. బ్రిటన్‌ను మించిపోయేందుకు భారత్‌ సిద్ధమయ్యింది. 2020లో బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను భారత్‌ తలదన్ని ప్రపంచంలో ఐదో పెద్ద ఎకానమీగా ఆవిర్భవిస్తుందంటూ తాజాగా పీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 

ప్రపంచ కుబేరులొచ్చారు...
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రపంచ టాప్‌–5 శ్రీమంతుల జాబితాలో చేరారు. 

పేదరికం తగ్గుముఖం
దారిద్య్రరేఖకు దిగువనున్న జనాభా శాతం 45 నుంచి 21.9కి తగ్గింది. (2011 గణాంకాలు)

మరిన్ని వార్తలు