సంస్కరణలతోనే భారత్‌ భారీ వృద్ధి 

18 Jan, 2020 02:10 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి నివేదిక

న్యూఢిల్లీ: భారత్‌ భారీ ఆర్థిక వృద్ధి సాధనకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి శుక్రవారం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020 పేరుతో ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను ఆవిష్కరించింది. ఒకవైపు సంస్థాగత, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు మరోవైపు ప్రభుత్వ వ్యయాల ద్వారా మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని మెరుగుపరచవచ్చని సూచించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 
- 2018లో భారత్‌ వృద్ధి 6.8 శాతం. 2019లో ఇది 5.7 శాతానికి తగ్గింది. ఆయా ప్రతికూల అంశాల నేపథ్యంలో ప్రభుత్వం పలు ద్రవ్యపరమైన సంస్కరణలను చేపట్టింది. ఈ దన్నుతో 2020లో వృద్ధి 6.6 శాతానికి రికవరీ కావచ్చు. అయితే భారీ వృద్ధికి మాత్రం రెగ్యులేol9టరీ, సంస్థాగత సంస్కరణలు కీలకం. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, కరెంట్‌ అకౌంట్‌ లోటు, విదేశీ మారకద్రవ్య నిల్వల విషయంలో ఉన్న సానుకూలతలు ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశం.  
భారత్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20) జీడీపీ వృద్ధి రేటు 5%, వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–21)లో 5.8–5.9% శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంది.  
ప్రతి ఐదు దేశాల్లో ఒకదేశం తలసరి ఆదాయం ఈ ఏడాది స్థిరంగా ఉండడమో లేక తగ్గుతుండడమో జరిగే అవకాశం ఉంది. అయితే తలసరి ఆదాయం 4 శాతం పైగా పెరిగే అవకాశం ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి.  
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక బలహీనత సుస్థిరాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉంది. ప్రత్యేకించి పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలపై ఈ ప్రభావం తీవ్రంగా పడే వీలుంది.  
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితితో యూరోపియన్‌ యూనియన్‌లో తయారీ రంగం బలహీనత నెలకొంది. తీవ్ర సవాళ్లు ఉన్నా.. వేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతంగా తూర్పు ఆసియా కొనసాగనుంది. ఇక చైనా వృద్ధి 2019లో 6.1%, 2020లో 6%గా ఉండొచ్చు.

29యేళ్ల కనిష్టానికి చైనా వృద్ధి 
2019లో చైనా వృద్ధి 29 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.1 శాతానికి పడిపోయింది. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దేశీయ డిమాండ్‌ మందగమనం, అమెరికాతో 18 నెలల వాణిజ్య యుద్ధం దీనికి ప్రధాన కారణాలని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి.   

>
మరిన్ని వార్తలు