జీఎస్‌టీ, నోట్లరద్దుతో ఆర్థిక వ్యవస్థకు మేలు

9 Oct, 2017 01:21 IST|Sakshi

సానుకూల ప్రభావమే ఉంది...

పన్ను చెల్లింపుదారులు పెరిగారు...

నగదు బ్యాంకుల్లోకి చేరింది...

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

వాషింగ్టన్‌: వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌), స్వచ్ఛ భారత్‌ వంటి ప్రభుత్వ చర్యలతో ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. జీఎస్‌టీ వల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య భారీగా పెరగగా... డీమోనిటైజేషన్‌ కారణంగా నగదును మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకురాగలిగామని చెప్పారు. ఇక స్వచ్ఛ భారత్‌తో పరిశుభ్రత ప్రాధాన్యతను అందరూ గుర్తించగలిగేలా చేశామన్నారు.

ఇక్కడ జరిగిన బెర్క్‌లీ ఇండియా సదుస్సుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సందేశం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో తమ ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణలన్నింటికీ ప్రజల మద్దతు పుష్కలంగా ఉందని కూడా ఆయన తెలిపారు. ‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మళ్లీ భారత్‌ వృద్ధి రేటు పరుగులు తీస్తుందన్న నమ్మకం ఉంది. భారీ జనాభా.. అందులోనూ యువత ఎక్కువగా ఉండటం మనకు కలిసొచ్చే అంశం’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.

మరింత జోరు అవసరం...  
వచ్చే ఒకటిరెండు దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే సవాలును భారత్‌ స్వీకరించాలంటే.. మరింత వేగంగా ఆర్థిక వ్యవస్థ పరుగులు తీయాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్‌టీ, స్వచ్ఛభారత్, డీమోనిటైజేషన్‌ వల్ల క్షేత్ర స్థాయిలో ఎలాంటి మార్పులూ లేవన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు.

వారం రోజుల అమెరికా పర్యటన...: వారంరోజుల పర్యటన కోసం నేడు జైట్లీ అమెరికాలో అడుగుపెట్టనున్నారు. న్యూయార్క్, బోస్టన్‌లలో కార్పొరేట్‌ దిగ్గజాలతో చర్చలతోపాటు వాషింగ్టన్‌లో జరిగే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకుల వార్షిక సమవేశాలకు హాజరుకానున్నారు. 

మరిన్ని వార్తలు