బిలియన్‌ డాలర్‌ ‘యాపా’రం

23 Oct, 2018 12:47 IST|Sakshi
ఓయో యాప్‌ వ్యవస్ధాపకుడు రితేష్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ : వినూత్న ఆవిష్కరణలతో భారత స్టార్టప్‌లు దూసుకెళుతున్న తీరు అగ్రదేశాలను సైతం అబ్బురపరుస్తోంది. పెరుగుతున్న యువ జనాభా, విచ్చలవిడిగా పెరిగిన స్మార్ట్‌ ఫోన్ల వాడకం, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఆదాయాలతో సంప్రదాయ వాణిజ్య పోకడలకు భిన్నంగా ఇంటిముంగిటే అందిస్తున్న ఆన్‌లైన్‌ యాప్‌ సేవలకు ఆదరణ పెరిగింది. అటు వ్యాపార సంస్ధలకు, ఇటు కస్టమర్లకూ వెసులుబాటు కల్పించే బిజినెస్‌ మోడల్స్‌తో స్టార్టప్‌లు వినూత్న సేవలతో ముందుకురావడంతో వాటి విజయానికి ఆకాశమే హద్దుగా మారింది.

పలు భారతీయ యాప్‌ల వ్యాపారం ఇప్పటికే బిలియన్‌ డాలర్‌ స్ధాయికి ఎదగడం ఇన్వెస్టర్ల చూపు మనవైపు మళ్లేలా చేస్తోంది. బీమా ప్రీమియం రూపురేఖలు మార్చిన పాలసీబజార్‌ ఎంతగా పాపులర్‌ అయిందో అక్షయ్‌ కుమార్‌ యాడ్‌ చేస్తే ఇట్టే అర్ధమవుతుంది. బీమా తీసుకోనందుకు మంచానపడిన వ్యక్తిని యమధర్మరాజు తీసుకువెళుతున్నట్టు వచ్చే ప్రకటన పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బీమా ప్రీమియం వసూళ్లలో తాము పారదర్శకత తీసుకువచ్చామని పాలసీబజార్‌ సీఈవో యశీష్‌ దహియా చెబుతారు. అమెరికా, చైనాలోనూ పాలసీబజార్‌ దూసుకుపోతోంది. పాలసీబజార్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టడంతో బిలియన్‌ డాలర్‌ (రూ 7000 కోట్లు) కంపెనీగా ఎదిగింది.

ఊబర్‌, అమెజాన్‌ల స్ఫూర్తితో..
భారత్‌లో తొలి తరం యాప్‌లు విదేశీ బిజినెస్‌ మోడళ్లను అనుసరించినా ఆ తర్వాత వినూత్న సేవలు, ఉత్పత్తులతో ఉరకలెత్తాయి. క్యాబ్‌ సేవలు అందించే ఊబర్‌ తరహాలో ఓలా వచ్చినా, స్నాప్‌డీల్‌, అమెజాన్‌ల తరహాలో ఆన్‌లైన్‌ రిటైలర్‌గా ఫ్లిప్‌కార్ట్‌ అవతరించింది. చైనా డిజిటల్‌ వాలెట్‌ దిగ్గజం అలీపేను అనుసరించి పేటీఎంకు మార్గం సుగమమైందని చెబుతారు. ఇక మెట్రో సిటీల్లో నివసించని, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం లేని కస్టమర్లను ఆకట్టుకునేందుకూ నవతరం స్టార్టప్‌లు విస్తరణ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఎదిగేందుకు ఇంకా కొన్ని పరిమితులున్నా విద్య, రవాణా, ఇతర పరిశ్రమల్లో సేవలు అందిస్తున్న నాలుగు యాప్‌ స్టార్టప్‌లు గత ఏడాదిలోనే బిలియన్‌ డాలర్‌ స్ధాయికి చేరుకున్నాయని అనాలిసిస్‌ కంపెనీ గ్రేహౌండ్‌ రీసెర్చికి చెందిన సంచిత్‌ విర్‌ గొజియా వెల్లడించారు.


అవసరాలను గుర్తిస్తే అవకాశాలే..
దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్‌ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని యూజర్లకు అవసరమైన సేవలు అందిస్తే వాణిజ్యపరంగా విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ బైజూస్‌ వ్యవస్ధాపక, సీఈఓ బైజు రవీంద్రన్‌ చెబుతున్నారు. దేశంలో చాలా స్కూళ్లు ఉపాధ్యాయులను నియమించుకుని జీతాలు చెల్లించే పరిస్థితిలో లేని కారణంగా వీడియో లెర్నింగ్‌ను ముందుకుతెచ్చి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు బైజూస్‌ శ్రీకారం చుట్టింది.

మూడేళ్ల కిందట తాము తీసుకువచ్చిన యాప్‌కు ప్రస్తుతం 17 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లున్నారని రవీంద్రన్‌ చెప్పారు. యాప్‌లో ప్రతినెలా 1,30,000 మంది విద్యార్ధులు చేరుతుండటంతో సంస్థ ఆదాయాలు ఈ ఏడాది మూడింతలయ్యాయని మార్చిలోనే సంస్థ బిలియన్‌ డాలర్‌ ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు.

ఇక భారత సప్లయిచైన్‌, రవాణా వ్యవస్థలు అసంఘటిత పోకడలతో ఉండటంతో దళారీలు ఇష్టానుసారంగా చెలరేగే ధోరణికి ఉడాన్‌ రాకతో అడ్డుకట్టపడింది. రెండేళ్ల కిందట మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ మార్కెట్‌ప్లేస్‌ యాప్‌ మేకర్‌ ఆన్‌లైన్‌లో 1,50,000 మంది బయ్యర్లు, సెల్లర్లను కలుపుతూ దూసుకుపోతోంది. ఎలక్ర్టానిక్స​, దుస్తులు, ఇతర ఉపకరణాల అమ్మకాల రూపురేఖలను సమూలంగా మార్చేసింది. కస్టమర్లు, వ్యాపారులకు మధ్య పలు భారతీయ భాషల్లో ఛాట్‌ ఫీచర్‌ను ఉడాన్‌ తమ యాప్‌లో పొందుపరిచింది.

ఓయో సంచలనం..
ట్రావెల్‌ స్టార్టప్‌ ఓయో హోటల్స్‌ కొద్దికాలంలోనే ఏకంగా ఐదు బిలియన్‌ డాలర్ల కంపెనీగా ఆవిర్భవించి అందరి దృష్టినీ ఆకర్షించింది. దేశంలోని హోటళ్లకు తమ బ్రాండ్‌ను తగిలించి ఆయా హోటల్‌ రూమ్‌లను తన వెబ్‌సైట్‌లో లిస్ట్‌ చేస్తూ ఓయో హాట్‌ యాప్‌గా మన్ననలు పొందింది. ఐదేళ్ల కిందట ట్రావెల్‌ స్టార్టప్‌గా అడుగులు వేసిన ఓయో ప్రస్తుతం 1,25,000 రూమ్‌లను లిస్ట్‌ చేస్తోంది.

భారత్‌లోని మొత్తం హోటల్‌ ఇన్వెంటరీలో ఇది 5 శాతం కావడం గమనార్హం.  దేశాన్ని మరింత సమర్ధవంతగా మలిచేందుకు కలలు కనే వ్యాపారవేత్తలు భారత్‌లో ఎంతోమంది ఉన్నారని ఈ యాప్‌ సృష్టికర్త 24 సంవత్సరాల రితేష్‌ అగర్వాల్‌ చెబుతున్నారు. చైనా, బ్రిటన్‌, దుబాయ్‌ల్లోనూ తనదైన శైలితో దూసుకెళ్లేందుకు ఓయో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. భారత్‌కు అనువైన బిజినెస్‌ మోడల్స్‌ ఇతర దేశాల్లో ఎంతవరకూ ఆదరణ పొందుతాయనేది వేచిచూడాలని నిపుణులు చెబుతున్నారు.


పెట్టుబడుల వెల్లువ..
భారత్‌లో యాప్‌ల వ్యాపారం భారీ వృద్ధితో దూసుకుపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు, వెంచర్‌ ఫండింగ్‌ సంస్ధలు పెట్టుబడుల ప్రవాహం కొనసాగిస్తున్నాయి. ఫుడ్‌ డెలివరీ యాప్‌లు స్విజ్జీ, జొమాటోలు వెంచర్‌ ఫండింగ్‌ ద్వారా 500 మిలియన్‌ డాలర్లు సేకరించి, మరిన్ని నిధుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ సహా ఇతర యాప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తికనబరుస్తున్నారు. భారత్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే నష్టపోతామనే ధోరణి ఇన్వెస్టర్లలో కపిపిస్తోందని ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ రవి గురురాజ్‌ విశ్లేషించారు.

మరిన్ని వార్తలు