ఎస్‌ఈజెడ్‌లకు మ్యాట్ మినహాయించాలి

10 Jun, 2014 01:16 IST|Sakshi
ఎస్‌ఈజెడ్‌లకు మ్యాట్ మినహాయించాలి

కేంద్రానికి ఎగుమతిదారుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లను(ఎస్‌ఈజెడ్) కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) నుంచి మినహాయించాలని ఎగుమతిదారుల మండలి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్య ఎగుమతుల వృద్ధితోపాటు, దేశీయ తయారీ రంగానికి సైతం సానుకూల ప్రయోజనం కల్పిస్తుందని ఈఓయూ అండ్ ఎస్‌ఈజెడ్ ఎగుమతి అభివృద్ధి మండలి(ఈపీసీఈఎస్) తన ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తెలియజేసింది. ఎస్‌ఈజెడ్‌లపై మ్యాట్‌ను తొలగించాలన్నది తమ ప్రథమ డిమాండ్ అని పేర్కొంది.
 
ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే కనీసం దీనిని 7.5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఎస్‌ఈజెడ్ డెవలపర్లను డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని కూడా సూచించింది. మ్యాట్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నులు ఎస్‌ఈజెడ్‌లకు సంబంధించి ‘పెట్టుబడుల సానుకూల ధోరణిని’ దెబ్బతీస్తున్నాయని పేర్కొంది.  సేవల పన్నుల నుంచి సైతం ఎస్‌ఈజెడ్‌లను మినహాయించాలని కోరింది.
 
దేశ ఎగుమతుల్లో ఎస్‌ఈజెడ్‌లదే కీలకపాత్ర. దేశ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 33 శాతం ఎస్‌ఈజెడ్‌లదే. దాదాపు 15 లక్షల మందికి ఎస్‌ఈజెడ్‌లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎస్‌ఈజెడ్‌ల నుంచి 2005-06లో ఎగుమతుల విలువ రూ.22,840 కోట్లు. 2013-14లో ఈ విలువ రూ.4.94 లక్షల కోట్లకు ఎగసింది.

>
మరిన్ని వార్తలు