లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్

30 Jul, 2015 01:37 IST|Sakshi

♦ 7 శాతం వృద్ధి రేటుతో
♦ 2050 నాటికి సాధ్యమే
♦ ప్రపంచబ్యాంక్ అంచనా
 
 న్యూయార్క్ : వచ్చే 30-35 సంవత్సరాల పాటు ఏటా ఏడు శాతం వృద్ధి రేటు కొనసాగించగలిగితే 2050 నాటికి లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని ప్రపంచ బ్యాంకు ఈడీ సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. ప్రస్తుతం 2,000 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 40,000 డాలర్లకు చేరగలదని తద్వారా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు ప్రజలు కూడా సంపన్నులు కాగలరని ఆయన వివరించారు. ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గర్గ్ ఈ విషయాలు తెలిపారు. అయితే, ఏకంగా 35 సంవత్సరాల పాటు ఏడు శాతం వృద్ధి రేటును నిలకడగా కొనసాగించగలగడం చాలా కష్టంతో కూడుకున్నదని, ఇందుకోసం ఎకానమీ నిర్వహణ తీరును భారీగా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

వ్యవసాయాన్ని సమూలంగా సంస్కరించుకోవాలని, సర్వీసులు, తయారీ రంగాలతో పాటు హెల్త్‌కేర్, టూరిజం మొదలైన వాటికి ఊతమివ్వాలని గర్గ్ తెలిపారు. ప్రస్తుతం భారత జనాభాలో 55 శాతం మంది ఇప్పటికే సర్వీసుల రంగంలో ఉన్నారని, దీన్ని 80-85 శాతానికి పెంచుకోవాలని గర్గ్ తెలిపారు. కానీ వ్యవసాయం నుంచి ప్రజలను తయారీ, సర్వీసుల రంగాల వైపు మళ్లించడం పెద్ద సవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా కొత్త అంశంలో నైపుణ్యం పొందిన పది-ఇరవై లక్షల మంది సుశిక్షితులను ప్రపంచానికి అందించేలా భార త్ ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు