వరుసగా ఎనిమిదో నెలలోనూ మారుతికి షాక్‌

9 Nov, 2019 15:54 IST|Sakshi

సాక్షి, ముంబై : డిమాండ్‌ క్షీణత దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. తాజాగా దేశీయంగా పాసింజర్‌ వాహనాలకు డిమాండ్ లేకపోవడం వల్ల మారుతి తన ఉత్పత్తిని వరుసగా 8 వ నెలలో తగ్గించుకోవలసి వచ్చింది.  ఇటీవల వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో  ఆటో కంపెనీలన్నీ  ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఈ  నేపథ్యంలో మారుతి, అశోక్‌ లేలాండ్‌ లాంటి కంపెనీలు ఉత్పత్తిలో కోత పెడుతున్న సంగతి తెలిసిందే.  ఈనేపథ్యంలోనే తాజాగా  వరుసగా ఎనిమిదవ నెలలో కూడా మారుతి ఉత్పత్తి కోతను ప్రకటించింది. గత నెలలో కంపెనీ మొత్తం వాహనాల ఉత్పత్తి 1,19,337 యూనిట్లు కాగా, గత ఏడాది అక్టోబర్‌లో 1,50,497 గా ఉంది.

గత ఏడాది అక్టోబర్‌లో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి 148,318 నుండి 117,383 యూనిట్లు తగ్గాయని  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది.  వాన్ల ఉత్పత్తి గత ఏడాదితో   పోలిస్తే సగానికి పడిపోయింది. 2018 అక్టోబర్‌లో 13,817  య నిట్లను ఉత్పత్తి చేయగా, గత నెలలో 7,661గా ఉంది. మినీ-సెగ్మెంట్లో ఆల్టో, ఎస్-ప్రెస్సో, ఓల్డ్ వాగన్ఆర్ లాంటి వాహనాల తయారీ గత ఏడాది ఇదే నెలలో 34,295 నుండి 20,985 కి పడిపోయింది.  

కాంపాక్ట్ విభాగంలో న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల  ఉత్పత్తి చేసిన యూనిట్ల సంఖ్య గత ఏడాది ఇదే నెలలో 74,167 తో పోలిస్తే అక్టోబర్‌లో  64,079 గా ఉంది.  అయితే జిప్సీ, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ -6, ఎస్-క్రాస్ వంటి యుటిలిటీ వాహనాలు మాత్రమే అక్టోబర్‌లో 22,526 నుండి 22,736 వద్ద స్వల్ప వృద్ధిని సాధించాయి.

ఏదేమైనా, అమ్మకాల పరంగా పండుగ సీజన్ డిమాండ్ కారణంగా స్వల్ప రికవరీ సంకేతాలను చూపించింది. దేశీయ మార్కెట్లో 2019 అక్టోబర్‌లో మొత్తం 1,44,277 యూనిట్లు విక్రయించింది. ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి మినీ కార్ల అమ్మకాలు క్షీణించగా, న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్లతో సహా కాంపాక్ట్ విభాగం సంవత్సరానికి 16 శాతం వృద్ధిని నమోదు చేసింది.

మరిన్ని వార్తలు