పదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!

18 Sep, 2017 01:34 IST|Sakshi
పదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!

2028 నాటికి సాధ్యమన్న హెచ్‌ఎస్‌బీసీ
ముంబై:
భారత్‌ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంటుందని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. 7 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా అవతరించి జపాన్, జర్మనీలను అధిగమించి ముందుకు వెళుతుందని అంచనా వేసింది. అదే సమయంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 6 లక్షల కోట్ల డాలర్లు, జపాన్‌ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 2015–16 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ 2.3 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. సంస్కరణలపై, సామాజిక రంగంపై స్థిరమైన దృష్టి కొనసాగించాలని సూచించింది.

సామాజిక నిధుల వ్యయం తీరు తగినంతగా లేదని, ఆరోగ్యం, విద్యపై వ్యయాలు చాలినంత లేవని స్పష్టం చేసింది. ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వం కోసం ఇది అవసరమని సూచించింది. వ్యాపార సులభతర నిర్వహణపై భారత్‌ ఎంతో దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది. జనాభా, స్థూల ఆర్థిక స్థిరత్వం అన్నవి దేశానికి కీలక బలాలుగా తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాగా, చైనా, జర్మనీ, జపాన్‌లు తర్వాతి స్థానాల్లో వున్నాయి.

వచ్చే ఏడాదే ఆర్థిక రికవరీ...
జీఎస్‌టీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.1 శాతం కంటే తక్కువగా ఉంటుందని హెచ్‌ఎస్‌బీసీ నివేదికలో పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రికవరీ ఉంటుందని అంచనా వేసింది. ఒకే సంస్కరణకు పరిమితం కాకుండా క్రమానుగతంగా మార్పులు జరిగేలా తగిన వ్యవస్థను మార్పు చేయాల్సి ఉందని అభిప్రాయపడింది.

జీఎస్టీ కారణంగా అవ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిందని, సంస్థల మూసివేతను నిదర్శనంగా చూపింది.వచ్చే పదేళ్లలో ఈ కామర్స్‌ రంగం 1.2 కోట్ల ఉద్యోగాలను కల్పించనుండగా, 2.4 కోట్ల ఉద్యోగాల తగ్గుదలలో ఇది సగమే అని పేర్కొంది. సామాజిక రంగంలో ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని, ఆరోగ్యం, విద్యా రంగాల్లో చేయాల్సింది ఎంతో ఉందని సూచించింది. భారత్‌ సేవల ఆధారిత ఆర్థిక రంగంగా కొనసాగుతూనే తయారీ, సాగు రంగాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు