ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే సర్వే..!

27 Jan, 2020 13:08 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వినియోగదారుల డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదని ఐహెచ్‌డీఎస్‌ సర్వే తెలిపింది. ఇటీవల కాలంలో భారత్‌లో వినియోగదారల డిమాండ్‌ క్షీణించిందని జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌)  వివరాల ఆధారంగా పలు సర్వేలు వెల్లడించినప్పటికీ.. తాజా సర్వే ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐహెచ్‌డీఎస్‌ నేతృత్వంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్), మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వినియోగదారుల డిమాండ్‌పై అధ్యయనం చేశారు. రాజస్థాన్‌లో 2,706 , బీహార్‌లో 1,643,  ఉత్తరాఖండ్ 479 కుటుంబాల జీవన ప్రమాణాలను అధ్యయనం చేశామని ఐహెచ్‌డీఎస్‌ సర్వే తెలిపింది.

ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వేకు భిన్నంగా 2011-17 మధ్య కాలంలో ప్రజల వినియోగం పెరిగిందని సర్వే అభిప్రాయపడింది. మరోవైపు తలసరి ఆదాయంలో వృద్ధి 2004-05, 2011-12 మధ్యకాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2011-17 మధ్య కాలంలో తలసరి ఆదాయం, తలసరి వినియోగం వరుసగా 3.5, 2.7 శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. 2004-05, 2011-12 సంవత్సరాలలో కుటుంబాలకు చెందిన తలసరి ఆదాయ వృద్ధి 7.2 శాతంగా ఉండగా, తలసరి వినియోగ వృద్ధి 4 శాతంగా నమోదైనట్టు సర్వే తెలిపింది.

2004-05, 2011-12 మధ్య కాలంలో వాహనాల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరిగాయని, కార్లు, మోటారు వాహనాల కొనుగోళ్లు 22 శాతానికి పెరిగాయని, 2017 నాటికి మరో పది పాయింట్లు పెరిగినట్లు సర్వే ప్రకటించింది. ఆర్థిక విధానాల రూపకల్పనలో వినియోగ డిమాండ్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్‌ఎస్‌ఎస్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.  స్పష్టమైన డాటా లేకపోవడం వల్లే ఆర్ధిక విధానాలను రూపకల్పన చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు