5జీ వేలం ఈ ఏడాదే..

15 Oct, 2019 00:07 IST|Sakshi

స్పెక్ట్రం ధరల్లో సంస్కరణలు తీసుకొస్తాం...

టెల్కోలకు మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ భరోసా

ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రభుత్వానికి తెలుసు. స్పెక్ట్రం వేలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే జరుగుతుంది. ధరకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేపడుతున్నాం‘ అని ప్రసాద్‌ చెప్పారు. మరోవైపు, వాట్సాప్‌ వంటి మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి అంశంపై స్పందిస్తూ ఎన్‌క్రిప్షన్‌ను ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని చెప్పారు.

అయితే, హింసను ప్రేరేపించే విధమైన తప్పుడు వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు .. దర్యాప్తు సంస్థలు వాటి మూలాలను కచ్చితంగా కనుగొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు అనువైన వ్యవస్థ ఉండటం తప్పనిసరన్నారు. స్పెక్ట్రం రేటును సంస్కరిస్తామంటూ ప్రసాద్‌ ప్రకటించడాన్ని సెల్యులార్‌ సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఇది టెలికం కంపెనీలకు ‘భారీ ఊరట‘ ఇస్తుందని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ చెప్పారు. తగినంత స్పెక్ట్రం, సరైన ధర ఉంటే రాబోయే వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు టెల్కోలు కూడా ఆసక్తి చూపుతాయని పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రం వేలానికి రూ. 4.9 లక్షల కోట్ల బేస్‌ ధరను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) గతేడాది సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

తొలి రోజున 5జీ టెక్నాలజీ మెరుపులు..
దేశీ టెలికం సంస్థలకు కీలక కార్యక్రమమైన ఐఎంసీ అక్టోబర్‌ 16 దాకా మూడు రోజుల పాటు సాగనుంది. ఈసారి ఒక లక్ష మంది దాకా దీన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌ తెలిపారు. ఇందులో 500 పైచిలుకు కంపెనీలు, 250 స్టార్టప్‌లు, 110 మంది విదేశీ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు.  తొలి రోజున వివిధ టెలికం దిగ్గజాలు పలు కొత్త కాన్సెప్ట్స్‌ను సందర్శకులకు ప్రదర్శించాయి. గాయకులు ఒక చోట పాడుతుంటే, మ్యూజిక్‌ కంపోజర్‌ మరోచోట కంపోజ్‌ చేస్తుండగా..రెండింటినీ అనుసంధానం చేసి ఏకకాలంలో పూర్తి పాటను లైవ్‌లో వినిపించే 5జీ టెక్నాలజీ కాన్సెప్ట్‌ను ఎరిక్సన్, ఎయిర్‌టెల్‌ ప్రదర్శించాయి. స్మార్ట్‌ వాహనాల్లో 5జీ టెక్నాలజీ వినియోగాన్ని వొడాఫోన్‌ ఐడియా ప్రదర్శించింది.  వైద్యం, విద్యా రంగాల్లో లైవ్‌ 3డీ హోలోగ్రాఫిక్‌ ప్రొజెక్షన్‌ను చూపించింది. రిలయన్స్‌ జియో.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత వీడియో కాల్‌ అసిస్టెంట్‌ను ప్రదర్శించింది. రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ఈసారి హాజరు కాకపోవడం గమనార్హం.

నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలి: బిర్లా
కొత్త డిజిటల్‌ భారతదేశాన్ని నిర్మించాలంటే టెలికం రంగం కీలకమని వొడాఫోన్‌ ఐడియా చైర్మన్‌ కుమార మంగళం బిర్లా తెలిపారు. ఈ రంగం వృద్ధికి నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలని, ప్రభుత్వం ఇందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని పేర్కొన్నారు. మరోవైపు, భారీ స్పెక్ట్రం ధరలు, నెట్‌వర్క్‌ విస్తృతికి భారీగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం టెలికం రంగంపై మరింత భారం మోపుతోందని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌ చైర్మన్‌ రాకేష్‌ భారతి మిట్టల్‌ చెప్పారు. 5జీ స్పెక్ట్రంనకు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రిజర్వ్‌ ధర మిగతా దేశాలతో పోలిస్తే ఏకంగా ఏడు రెట్లు అధికమన్నారు. 5జీ లో భారత్‌ లీడరుగా ఎదగాలంటే స్పెక్ట్రం ధర సహేతుకంగా ఉండేలా చూడటం అవసరమని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా