సులభతర వాణిజ్యంలో భారత్‌కు మెరుగైన ర్యాంకు

24 Oct, 2019 10:20 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాంక్‌ గురువారం ప్రకటించిన సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) ర్యాంకింగ్స్‌లో భారత్‌కు మెరుగైన స్ధానం లభించింది. భారత్‌ ఏకంగా 14 దేశాలను అధిగమించి ఈ జాబితాలో 63వ స్ధానానికి చేరుకుంది. మేకిన్‌ ఇండియాతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన సంస్కరణలతో భారత్‌ మెరుగైన ర్యాంక్‌ను సాధించింది. మెరుగైన సామర్థ్యం కనబరిచిన టాప్‌ 10 దేశాల సరసన వరుసగా మూడోసారి భారత్‌ చేరింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ప్రభావంతో భారత వృద్ధి రేటును ఆర్బీఐ, ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఫ్‌ సహా పలు రేటింగ్‌ ఏజెన్సీలు తగ్గించిన నేపథ్యంలో ఈ ర్యాంకింగ్‌లు వెలువడటం గమనార్హం.

2014లో నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరిన సమయంలో భారత్‌ 190 దేశాలతో కూడిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అట్టడుగున 142వ స్ధానంలో ఉండటం గమనార్హం. నాలుగేళ్ల సంస్కరణల అనంతరం 2018లో భారత్‌ ర్యాంక్‌ తొలిసారిగా 100కు చేరింది. 2017లో ఇరాన్‌, ఉగాండాల కంటే దిగువన 130వ స్ధానంలో భారత్‌ నిలిచింది. పన్నులు, దివాలా చట్టం ఇతర సంస్కరణల ఊతంతో గతేడాది భారత్‌ ఏకంగా 23 ర్యాంకులు ఎగబాకి 77వ స్ధానానికి చేరింది. ఇక ఒకట్రెండు సంవత్సరాల్లో సులభతర వాణిజ్యంలో భారత్‌ టాప్‌ 50 దేశాల సరసన చేరే లక్ష్యంతో శ్రమిస్తోంది. మరోవైపు భారత్‌ సులభతర వాణిజ్యంలో ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని అద్భుత సామర్ధ్యం కనబరిచిన టాప్‌ 10 దేశాల జాబితాలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకుందని వరల్డ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ ఎకనమిక్స్‌కు చెందిన సైమన్‌ డిజన్‌కోవ్‌ ప్రశంసించారు. ఈ ఏడాది ర్యాంకులు గణనీయంగా మెరుగుపడిన టాప్‌ 10 దేశాల జాబితాలో భారత్‌తో పాటు సౌదీ అరేబియా (62), జోర్డాన్‌ (75), టోగో (97), బహ్రెయిన్‌ (43), తజికిస్తాన్‌ (106), పాకిస్తాన్‌ (108), కువైట్‌ (83), చైనా (31), నైజీరియా (131)లు చోటు దక్కించుకున్నాయి.

మరిన్ని వార్తలు