సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం

22 Feb, 2020 19:30 IST|Sakshi
సీఈఏ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ (ఫైల్‌ ఫోటో)

ప్రో క్రోనీ కాదు.. ప్రో బిజినెస్‌ కావాలి: కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌

ముంబై: దేశం అభివృద్ధి చెందాలంటే వ్యాపార విధానాలను మరింత సులభతరం చేయాలని ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ తెలిపారు.  శనివారం ఐఐటీ కాన్పూర్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్‌ ఆశిస్తున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవ్వాలంటే సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రో క్రోనీ క్యాపిటలిజం ద్వారా కేవలం వ్యాపార వర్గాల వారికి, అధికారంలో ఉన్నవారికే లబ్ది చేకూరుతుందన్నారు. దేశంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో  ప్రో బిజినెస్‌ పాలసీలు తోడ్పడుతాయని, అంతేకాకుండా వ్యాపార వర్గాల్లో పోటీ తత్వాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేవలం ప్రస్తుత ఆర్థిక నిపుణులపైనే ఆధారపడకుండా, బహుళ ప్రాచుర్యం పొందిన ప్రాచీన అర్థశాస్త్రం లాంటి గ్రంథాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. సంపద సృష్టించే మెళుకువలను ప్రాచీన కాలం నాటి అర్థశాస్త్రంలో చక్కగా వివరించారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో సూచించినట్టుగా దేశంలోనే ముడిసరుకుల ఉత్పత్తి వల్ల భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశం దూసుకెళ్లాలంటే ఎక్కువ స్థాయిలో ముడిసరుకులను ఎగుమతి చేయాలని తెలిపారు. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాయని పేర్కొన్నారు. దేశంలోకి  ప్రో బిజినెస్‌ పాలసీలు అమలు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

చదవండి: అపుడు దోసానామిక్స్‌, ఇపుడు థాలినామిక్స్‌

మరిన్ని వార్తలు