టాప్ లో చైనా, ఐదో స్థానంలో భారత్

2 May, 2016 15:19 IST|Sakshi
టాప్ లో చైనా, ఐదో స్థానంలో భారత్

ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న నకిలీ వస్తువులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. నాణ్యత కలిగిన వస్తువు ఏది నకిలీ వస్తువులు ఏవి? అనేది గుర్తుపట్టడం ఎంతో కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏ ఏ దేశాల నుంచి నకిలీ వస్తువుల వాణిజ్యం ఎక్కువగా జరుగుతుందో ఆర్గనైజేషన్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, యూరోపియన్ యూనియన్స్ ఇంటెలెక్యువల్ ప్రాపర్టీ ఆఫీసు సంయుక్తంగా సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో భారత్ ఐదో స్థానంలో నిలిచిందట. నకిలీ వస్తువుల ఎక్కువగా ఎగుమతి చేస్తూ భారత్ ఈ స్థానంలో నిలిచింది. మరి మొదటి స్థానాన్ని ఏ దేశం ఆక్రమించుకుందో అనుకుంటున్నారా..? అతి తక్కువ ధరలకు వస్తువులను మార్కెట్లోకి సరఫరా చేసే చైనా నకిలీ వస్తువుల వాణిజ్యంలో ప్రథమ స్థానంలో దక్కించుకుందని సర్వే పేర్కొంది.


ప్రపంచవ్యాప్తంగా జరిగే నకిలీ, పైరేటెడ్ వస్తువుల దిగుమతుల్లో చైనా వాణిజ్యం 63 శాతం(ట్రిలియన్ డాలర్ లో సగం) ఉందని సర్వేలో వెల్లడైంది. చైనా తర్వాత టర్కీ, సింగపూర్, థాయ్ లాండ్, ఇండియాలు టాప్-5లో ఉన్నాయని సర్వే పేర్కొంది. రెండో స్థానంలో ఉన్న టర్కీ 3.3 శాతం నకిలీ వాణిజ్యం ఉండగా, సింగపూర్ 1.9 శాతం, థాయ్ లాండ్ 1.6 శాతం, భారత్ 1.2 శాతంతో ఈ వాణిజ్యానికి ఆజ్యం పోస్తున్నాయని సర్వే తెలిపింది. నకిలీ వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగుమతుల్లో 2.5 శాతం ఉంటున్నాయని అంటే ఏడాదిలో సగం ట్రిలియన్ డాలర్లు ఈ వస్తువులేనని పేర్కొంది.

ఈ దేశాలు నకిలీ వస్తువులను ఎక్కువగా అమెరికాకు సరఫరా చేస్తున్నాయని తేలింది. అమెరికా తర్వాత ఇటాలియన్, ఫ్రెంచ్ ఈ నకిలీ వస్తువుల బారిన ఎక్కువగా పడుతున్నాయని నివేదించింది. యూరోపియన్ యూనియన్ లోకి వచ్చే దిగుమతి వస్తువుల్లో 5శాతానికి పైగా నకిలీ వస్తువులే ఉంటున్నాయని, చైనా లాంటి మధ్యతరగతి దేశాల నుంచి ఇవి ఎక్కువగా ఉద్భవిస్తున్నాయని సర్వే పేర్కొంది. చైనా ఈ వస్తువుల తయారీలో మూలంగా మారిందని పేర్కొంది. హ్యాండ్ బ్యాగ్స్, సుగంధ ద్రవ్యాల నుంచి కెమికల్, తయారీ విభాగాల వరకూ దాదాపు అన్నీ నకిలీ వస్తువులేనని సర్వే తెలిపింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు