భారత్‌ భవిష్యత్తు భేష్‌

5 Mar, 2020 05:20 IST|Sakshi
బ్లాక్‌స్టోన్‌ సీఈఓ స్టీఫెన్‌ ఏ ష్వార్జ్‌మాన్‌

కితాబిచ్చిన బ్లాక్‌స్టోన్‌ బాస్‌

ముంబై: ఇతర దేశాలతో పోల్చితే భారత్‌ తమకు మంచి ఫలితాలనందించిందని అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం, బ్లాక్‌స్టోన్‌ వెల్లడించింది. భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆ సంస్థ చైర్మన్, సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న స్టీఫెన్‌ ఏ ష్వార్జ్‌మాన్‌ వ్యక్తం చేంశారు. భవిష్యత్తులో భారత్‌ దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఎంపిక చేసిన మీడియా వర్గాలతో ఆయన ఇక్కడ ముచ్చటించారు. 2006లో భారత్‌కు వచ్చానని, అప్పటి భారత్‌కు, ఇప్పటి భారత్‌కు చాలా తేడా ఉందని వివరించారు. బ్యాంకింగ్‌ రంగ సమస్యలు ఉన్నప్పటికీ, మంచి జోరు చూపిస్తోందని పేర్కొన్నారు.   భారత విద్యారంగం పనితీరు బాగా ఉందని స్టీఫెన్‌ కితాబిచ్చారు. ప్రతి ఏడాది అమెరికాలో కంటే ఏడు రెట్లు అధికంగా ఇంజినీర్లు తయారవుతున్నారని, విస్తారమైన వృద్ధికి అవకాశాలున్నాయని వివరించారు. 2005 నుంచి భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ 15 ఏళ్లలో 40 కంపెనీల్లో 1,550 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఒక్క గత ఏడాదిలోనే 600 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేసింది. కాగా 30 ఏళ్ల క్రితం 4 లక్షల డాలర్లతో ఆరంభమైన బ్లాక్‌స్టోన్‌ సంస్థ ఇప్పుడు 57,200 కోట్ల డాలర్ల దిగ్గజంగా ఎదిగింది.

మరిన్ని వార్తలు