పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ షురూ

31 Jan, 2017 00:27 IST|Sakshi
పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ షురూ

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ప్రయోగాత్మకంగా సర్వీసులు ప్రారంభించింది. రాయ్‌పూర్, రాంచీల్లో సేవలు ఆరంభించినట్లు సంస్థ సీఈవో ఏపీ సింగ్‌ తెలిపారు. రూ. 25,000 దాకా డిపాజిట్లపై 4.5 శాతం, రూ. 25,000–రూ.50,000 దాకా 5 శాతం, అంతకు మించి రూ. 1,00,000 దాకా డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ప్రతి జిల్లాలో తమ శాఖ ఉండాలని నిర్దేశించుకున్నట్లు, 3 లక్షల మంది పైచిలుకు పోస్ట్‌మెన్‌ ఇందులో పాలుపంచుకోనున్నట్లు సింగ్‌ పేర్కొన్నారు. ఇండియా పోస్ట్‌కి చెందిన 1,000 ఏటీఎంలు.. ఐపీపీబీకి బదిలీ కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మారుమూల ప్రాంతాల వారికి కూడా బ్యాంకింగ్‌ సేవలను చౌకగా పేమెంట్స్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తేగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇవి సాంప్రదాయ బ్యాంకులకు పోటీ ఇవ్వగలవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సెప్టెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 650 శాఖలు ప్రారంభించాలని ఐపీపీబీ నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. చెల్లింపుల బ్యాంకులు ఖాతాకు రూ. 1 లక్ష దాకా డిపాజిట్లు స్వీకరించవచ్చు. పేమెంట్స్‌ బ్యాంక్‌ల ఏర్పాటుకు ఆర్‌బీఐ నుంచి లైసెన్స్‌లు పొందిన వాటిలో ఐపీపీబీతో పాటు ఎయిర్‌టెల్, పేటీఎం తదితర సంస్థలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు