విండోస్‌పై డిస్కౌంట్‌ ఇవ్వండి

1 Jul, 2017 01:30 IST|Sakshi
విండోస్‌పై డిస్కౌంట్‌ ఇవ్వండి

మైక్రోసాఫ్ట్‌ను కోరిన కేంద్రం
న్యూఢిల్లీ: భారత్‌లోని యూజర్ల కోసం విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం (ఓఎస్‌) లేటెస్ట్‌ వెర్షన్‌ను కొంత డిస్కౌంటు ధరకు అందించాలని సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను కేంద్రం కోరింది. మాల్‌వేర్, రాన్‌సమ్‌వేర్‌ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లు కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు దీనివల్ల కాస్త వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. ‘భారత్‌లోని యూజర్లు పాత ఓఎస్‌ నుంచి లేటెస్ట్‌ ఓఎస్‌ (విండోస్‌ 10)కి అప్‌గ్రేడ్‌ అయ్యే వెసులుబాటు కల్పిస్తూ.. వన్‌ టైమ్‌ ప్రత్యేక డిస్కౌంటు రేటుపై ఓఎస్‌ను అందించాలని మైక్రోసాఫ్ట్‌ను కోరాం‘ అని నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ గుల్షన్‌ రాయ్‌ తెలిపారు.

దీనికి మైక్రోసాఫ్ట్‌ కూడా సుముఖంగానే ఉందని, సూత్రప్రాయంగా ఈ ప్రతిపాదనకు అంగీకరించిందని ఆయన వివరించారు. డిస్కౌంటు ఎంత ఉండాలనే దానిపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉండగా.. కనీసం రూ. 1,000 లేదా అంతకన్నా కొంత తక్కువగానైనా ఉండాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం విండోస్‌ 10 హోమ్‌ ఓఎస్‌ ధర రూ. 8,000గాను, ప్రొఫెషనల్‌ వెర్షన్‌ రేటు రూ. 13,000గాను ఉంది. దేశీయంగా లక్షల కొద్దీ కంప్యూటర్స్‌ విండోస్‌ ఓఎస్‌పై పనిచేస్తున్నప్పటికీ.. విండోస్‌ 10కి అప్‌గ్రేడ్‌ అయిన వాటి సంఖ్య తక్కువే.

మరిన్ని వార్తలు