వృద్ధి అంచనాలను  కొనసాగించిన ఏడీబీ

13 Dec, 2018 01:21 IST|Sakshi

రూపాయి పతనంతో ఎగుమతులు పుంజుకుంటాయ్‌

వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతున్నాయ్‌

ఏడీబీ తాజా నివేదిక వెల్లడి   

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందన్న గత అంచనాలను ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) కొనసాగించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధిని సాధించగలదన్న అంచనాలను కూడా అలాగే కొనసాగించింది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో ఒత్తిడులున్నా, వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యపరమైన సమస్యలున్నా భారత్‌ ఈ స్థాయి వృద్ధిని సాధించగలదన్న అంచనాలను ఏడీబీ వెల్లడించింది. ‘ఏషియన్‌  డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీఓ) 2018 అప్‌డేట్‌’ పేరిట ఏడీబీ రూపొందించిన తాజా నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..,  

∙వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతుండటం, ఎగమతులు పుంజుకుంటుండటంతో భారత వృద్ధి జోరు కొనసాగగలదు.  
∙భారత జీడీపీ ఈ క్యూ1లో 8.2%, క్యూ2లో 7.1% గా నమోదైందని, మొత్తం మీద ఈ ఆర్థిక సంవ త్సరం తొలి 6 నెలల్లో వృద్ధి సగటున 7.6%గా ఉంది.  
∙క్యూ2లో వృద్ధి అంచనాల కంటే తక్కువే.  
∙వాణిజ్య ఉద్రిక్తతలు, ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలున్నా, క్రూడ్‌ ధరలు దిగిరావడం భారత్‌కు కలసిరానున్నది.  
∙మరోవైపు రూపాయి బలహీనపడటం వల్ల ఎగుమతులు పుంజుకుంటాయి.  
∙ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధిని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం వృద్ధిని సాధించగలదు.  
∙దేశీయంగా అధిక డిమాండ్‌ కారణంగా ఆసియా దేశాలు విదేశీ ప్రతికూలతలను తట్టుకోగలవు.

మరిన్ని వార్తలు