దెబ్బకు దెబ్బ : ట్రంప్‌ సర్కార్‌కు భారత్‌ ఝలక్‌

16 Jun, 2018 14:56 IST|Sakshi

న్యూఢిల్లీ : ట్రంప్‌ సర్కార్‌కు దెబ్బకు దెబ్బ తగిలింది. స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా డ్యూటీలు పెంచడంతో, భారత్‌కు కూడా అదే స్థాయిలో టారిఫ్‌లను విధించి, ట్రంప్‌ సర్కార్‌కు ఝలకిచ్చింది. మోటార్‌ సైకిల్‌, ఇనుము, ఉక్కు, బోరిక్‌ ఆమ్లం, కాయధాన్యాలు వంటి 30 రకాల ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీని 50 శాతం పెంచే ప్రతిపాదనను భారత్‌ ప్రభుత్వం డబ్ల్యూటీఓకు సమర్పించింది. స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లను విధించడంతో ట్రంప్‌ సర్కార్‌ 241 మిలియన్‌ డాలర్ల వరకు ఆర్జిస్తోంది. ట్రంప్‌ టారిఫ్‌లపై ఆగ్రహించిన భారత్‌, అంతేమొత్తంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే 30 రకాల ఉత్పత్తులపై రాయితీలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది మే నెలలో కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదం, ఆపిల్‌, మోటార్‌సైకిల్స్‌ వంటి 20 రకాల ఉత్పత్తులపై కూడా డ్యూటీలను 100 శాతం పెంచాలని భారత్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. 

ఈ ఉత్పత్తులపై భారత్‌ ప్రతిపాదించిన అదనపు డ్యూటీలు 10 శాతం నుంచి 100 శాతం రేంజ్‌లో ఉన్నాయి. 800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ కెపాసిటీ ఉన్న మోటార్‌ సైకిళ్లపై 50 శాతం డ్యూటీ, బాదంపై 20 శాతం, వాల్‌నట్స్‌పై 20 శాతం, ఆపిల్స్‌పై 25 శాతం డ్యూటీని భారత్‌ ప్రతిపాదించింది. భారత్‌ ప్రతీకార టారిఫ్‌లను విధించడం ఇదే మొదటిసారి. ట్రంప్‌ సర్కార్‌ వెళ్తున్న నియంతృత్వ పోకడకు ప్రతీకారంగా భారత్‌ ఈ టారిఫ్‌లను విధించింది. సమీక్షించిన ఈ డ్యూటీలు జూన్‌ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాకు ఇస్తున్న మినహాయింపులను నిషేధించే నిర్ణయం తీసుకున్నామని, దీంతో 238.09 మిలియన్‌ డాలర్ల డ్యూటీని సేకరించనున్నామని డబ్ల్యూటీఓకు భారత్‌ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగ, గత మార్చిలో అమెరికా తమ దేశానికి దిగుమతి అయ్యే స్టీల్‌ ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం డ్యూటీలను విధిస్తున్నట్టు ప్రకటించింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా