ఇన్వెస్టర్ పరిరక్షణలో భారత్ భేష్

30 Oct, 2014 01:47 IST|Sakshi
ఇన్వెస్టర్ పరిరక్షణలో భారత్ భేష్

* ప్రపంచబ్యాంక్ నివేదికలో 7వ స్థానం
* 21 నుంచి ముందుకు జంప్

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల  ప్రయోజనాల పరిరక్షణలో భారత్ 7వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ది ఈ విషయంలో మొదటి స్థానం. వ్యాపార నిర్వహణకు సంబంధించి తన వార్షిక నివేదికలో ప్రపంచబ్యాంక్ ఈ విషయాన్ని తెలిపింది. న్యూజిలాండ్ తరువాతి వరుసలో హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్, మలేషియా, ఐర్లాండ్ ఉన్నాయి. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్ మైనారిటీ ఇన్వెస్టర్ (ప్రమోటర్లు మినహా పబ్లిక్ ఇన్వెస్టర్లు) రక్షణలో ముందుండడం విశేషం. మైనారిటీ ఇన్వెస్టర్లకు సంబంధించి భారత్‌లో క్యాపిటల్ మార్కెట్ అలాగే కంపెనీల చట్టాలు, నిబంధనల పటిష్టత-సంస్కరణలకు ఈ నివేదిక ఊతం ఇచ్చినట్లయ్యింది. ఈ విషయంలో భారత్‌తో పాటు కెనడా, అల్‌బేనియాలకు కూడా ఏడవ ర్యాంక్‌నే ప్రపంచబ్యాంక్ ఇచ్చింది. నిజానికి గత ఏడాది భారత్‌ది ఈ విషయంలో 21వ ర్యాంక్.
 
వ్యాపారాలకు అనువైన దేశాల్లో భారత్ ర్యాంక్ 142..!
కాగా మొత్తం 10 అంశాల్లో ర్యాంకింగ్స్ ప్రాతిపదికన 189 దేశాలకు ‘వ్యాపారాలకు అనువైన దేశాల’ ర్యాకిం గ్స్‌ను ప్రపంచబ్యాంక్ ఇస్తుంది. ఈ అంశాల్లో మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ ఒకటి. మొత్తంగా 10 అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ‘వ్యాపారాలకు అనువైన దేశాల’ ర్యాకిం గ్స్‌ను చూస్తే భారత్‌కు వచ్చిన ర్యాంక్ 142. గత ఏడాదితో పోల్చితే భారత్ ర్యాంక్ మరో రెండు స్థానాలకు తగ్గింది. కాగా, ఈ ర్యాకింగ్స్‌లో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది.

>
మరిన్ని వార్తలు