డౌన్‌లోడ్‌ స్పీడ్‌.. మనం వెనకే!

27 Mar, 2018 01:18 IST|Sakshi

109వ స్థానంలో భారత్‌: నార్వేకు అగ్రస్థానం

ఓక్లా మొబైల్‌ స్పీడ్‌ టెస్ట్‌లో వెల్లడి   

ముంబై: భారత్‌లో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. చౌక టారిఫ్‌ల వల్ల మొబైల్‌ వినియోగదారుల్లో డేటా వినియోగం భారీగా పెరిగింది.. మొబైల్‌ డేటా వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉంది.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. అదే మరొకవైపు చూస్తే.. మొబైల్‌ ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో మన దేశం టాప్‌–10, టాప్‌–50, అఖరికి టాప్‌–100లో కూడా స్థానం దక్కించుకోలేదు. 109వ స్థానంలో నిలిచింది. 

మొబైల్‌ ఫోన్‌లో సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఫిబ్రవరిలో 9.01 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఇది గతేడాది నవంబర్‌లో 8.80 ఎంబీపీఎస్‌. ఇక్కడ స్పీడ్‌ కొద్దిగా పెరిగినా కూడా స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 109వ స్థానంలోనే ఉన్నాం. ఓక్లా స్పీడ్‌ టెస్ట్‌ ఇండెక్స్‌ ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో నార్వే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశంలో సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 62.07 ఎంబీపీఎస్‌.

ఇక ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బాండ్‌ విషయంలో మాత్రం భారత్‌ ర్యాంక్‌ గతేడాది నవంబర్‌ నుంచి చూస్తే ఈ ఫిబ్రవరి చివరి నాటికి 76 నుంచి 67కు మెరుగుపడింది. ఇదే సమయంలో ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బాండ్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ కూడా 18.82 ఎంబీపీఎస్‌ నుంచి 20.72 ఎంబీపీఎస్‌కి పెరిగింది. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బాండ్‌ విభాగంలో సింగపూర్‌ టాప్‌లో ఉంది. ఇక్కడ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 161.53 ఎంబీపీఎస్‌గా రికార్డ్‌ అయ్యింది. కాగా మొబైల్‌ డేటా వినియోగంలో నెలకు 150 కోట్ల గిగాబైట్స్‌తో భారత్‌ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని నీతి ఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమితాబ్‌ కాంత్‌ గత డిసెంబర్‌లో ప్రకటించారు. అమెరికా, చైనా రెండు దేశాల డేటా వినియోగం కన్నా ఇది ఎక్కవని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు