జీడీపీ జిగేల్‌..!

1 Jun, 2018 00:48 IST|Sakshi

2017–18 క్యూ4లో  జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతం 

ఏడు త్రైమాసికాల్లో  ఈ స్థాయి వృద్ధి ఇదే తొలిసారి

తయారీ, నిర్మాణం,  సేవల రంగాల దన్ను

వ్యవసాయమూ కలిసి వచ్చింది

2017–18 మొత్తంగా తగ్గిన వృద్ధి 

7.1 శాతం నుంచి 6.7%కి డౌన్‌  

న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2017–18, ఏప్రిల్‌–మార్చి) అటు కేంద్రానికి ఇటు ఆర్థిక విశ్లేషకులకూ ఊరట నిచ్చింది. వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా హోదాను నిలబెట్టుకుంది. 2016–17 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 8.1 శాతం రేటు నమోదయ్యింది. అటు తర్వాత గడచిన ఏడు త్రైమాసికాల్లో  ఈ స్థాయిలో వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. జీడీపీలో దాదాపు 15 శాతం చొప్పున వాటా ఉన్న తయారీ, వ్యవసాయ రంగాలు 55 శాతంపైగా వాటా ఉన్న సేవల రంగం మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. కాగా 2016–17 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో వృద్ధి రేటు 6.1 శాతం.  ఇక 2017–18 ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదయ్యింది. 2016–17లో ఈ రేటు 7.1 శాతం. అంటే వార్షికంగా మాత్రం వృద్ధి రేటు తగ్గిందన్నమాట. 2015–16లో వృద్ధి రేటు 8.2 శాతం.  కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌ఓ) తాజా గణాంకాలను గురువారం విడుదల చేసింది.  ముఖ్యాంశాలు చూస్తే... 

►2017–18లో తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.6%. తర్వాతి నెలల్లో వరుసగా 6.3%, 7%గా నమోదయ్యింది. చివరి త్రైమాసికంలో చక్కటి పనితీరుతో 7.7% వృద్ధిరేటు నమోదయ్యింది.  
►వ్యవసాయం (4.5 శాతం), తయారీ (9.1 శాతం), నిర్మాణ (11.6 శాతం) రంగాలు తాజా త్రైమాసికం ఫలితాలకు వెన్నుదన్నుగా నిలిచాయి. 
►జనవరి– మార్చి త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.8 శాతం. ఇదే త్రైమాసికంలో భారత్‌ 7.7 శాతం వృద్ధి సాధించడంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదా కొనసాగిస్తున్నట్లు అయ్యింది.  
►తయారీ, వ్యవసాయం, మైనింగ్‌ కార్యకలాపాల మందగమనమే వార్షిక నిరుత్సాహ ఫలితానికి కారణమని గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే నిర్మాణం, ఫైనాన్షియల్‌ సేవల్లో కొంత మెరుగుదల కనిపిస్తోంది.  
►పెట్టుబడికి సూచికగా ఉన్న గ్రాస్‌ ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ (జీఎఫ్‌సీఎఫ్‌) 2017–18లో రూ.47.79 లక్షల కోట్లుగా అంచనా. 2016 – 17లో ఈ విలువ రూ.43.52 లక్షల కోట్లు.  

అంచనాలకు అనుగుణంగానే ద్రవ్యలోటు!
ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 2017–18 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతం వద్ద కట్టడి చేయాలన్నది కేంద్రం లక్ష్యం.  కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) తాజాగా విడుదల చేసిన ‘సవరిత’ గణాంకాలు ద్రవ్యలోటు లక్ష్యం కట్టుతప్పడం లేదన్న భరోసాను ఇస్తున్నాయి. 2017–18లో ద్రవ్యలోటు 3.53 శాతంగా ఉంటున్నట్లు  సీజీఏ తాజా గణాంకాలు తెలిపాయి. ద్రవ్యలోటు విలువలో చూస్తే, రూ.5.91 లక్షల కోట్లుగా నమోదయ్యింది. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 99.5 శాతం. నిజానికి 2017–18లో ద్రవ్యలోటు లక్ష్యం బడ్జెట్‌లో 3.2 శాతంగా ఉండాలని తొలుత నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి అంచనాలను 3.2%గా మార్చారు. 2018–19లో జీడీపీలో 3.3 శాతంగా దీనిని నిర్దేశించడం జరిగింది. కాగా రెవెన్యూ లోటు జీడీపీలో 2.65 శాతంగా ఉంది. విలువలో ఇది రూ.4.43 లక్షల కోట్లు. బడ్జెట్‌ అంచనాల్లో 101 శాతం. రుణ సమీకరణలు, పెట్టుబడుల ఉపసంహరణల వంటి మార్గాల ద్వారా ద్రవ్యలోటును కేంద్రం భర్తీ చేస్తుంది.   

వృద్ధి బాట పటిష్టం: కేంద్రం 
భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గడచిన ఆర్థి క సంవత్సరం చివరి త్రైమాసికం (2018–19, జనవరి–మార్చి)లో 7.7 శాతంగా నమోదవడం పట్ల ఆర్థికశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ వృద్ధి బాట పటిష్టంగా ఉందనడానికి ఈ గణాంకాలు నిదర్శనమన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో(ఏప్రిల్‌–మార్చి) వృద్ధి 7.5 శాతంగా నమోదవుతుందన్న కేంద్రం అంచనాల్లో ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు.  జనవరి– మార్చి త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.8 శాతం.  ప్రతి త్రైమాసికానికీ భారత్‌ వృద్ధి రేటు పెరుగు తోందని పేర్కొన్న ఆయన, ప్రధాని నేతృత్వంలో ఇది సరైన ప్రగతిగా అభివర్ణించారు. 2017–18లో భారత్‌ వృద్ధిరేటు 6.7%. ‘‘జీడీపీ వృద్ధి, చమురు ధరల మధ్య సంబంధం ఉన్నట్లు నేను భావించడం లేదు. అదేవిధంగా  ద్రవ్యలోటు కూడా లక్ష్యాలకు అనుగుణంగా ఉంది’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.   

సంస్కరణలు ఫలితాలిస్తున్నాయ్‌... 
భారత్‌ నాల్గవ త్రైమాసిక ఫలితాలను చూస్తే, ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించినట్లుగా కనబడుతోంది.  
– హాస్‌ముఖ్‌ ఆదియా, ఫైనాన్స్‌ సెక్రటరీ 

పట్టాలపైకి ఆర్థిక వ్యవస్థ 
భారత్‌ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోందని సీఐఐ భావిస్తోంది. దీనిని తాజా గణాంకాలు నిరూపించాయి. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తోంది. 
– చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ 

క్రూడ్‌ ధరలే సమస్య 
ఆర్థిక వ్యవస్థ మెరుగుపడ్డం ప్రారంభమైంది. అటు పెట్టుబడులు, ఇటు వినియోగం రెండూ బాగున్నాయి. ఎటొ చ్చీ అధిక చమురు ధరలు, కఠిన ద్రవ్య పరిస్థితులు ఇప్పుడు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 
– డీఎస్‌ రావత్, అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ 

మరిన్ని వార్తలు