గ్రామాల్లో కార్లకు గిరాకీ!

19 Jul, 2017 00:31 IST|Sakshi
గ్రామాల్లో కార్లకు గిరాకీ!

జూన్‌ క్వార్టర్లో 30 శాతం పెరిగిన విక్రయాలు  
మారుతి, హ్యుందాయ్‌లకు కలిసొచ్చిన కాలం
 

న్యూఢిల్లీ: కార్ల కంపెనీలపై ఈ వర్షకాలం లాభాల జల్లు కురిపిస్తోంది. సాధారణ వర్షపాతం అంచనాలతో మొదటి త్రైమాసికంలో కార్ల విక్రయాలు అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో 30% పెరగ్గా, హ్యుందాయ్‌ అమ్మకాల్లో 23%కి పైగా వృద్ధి నమోదైంది. దేశీయ కార్ల మార్కెట్‌లో ఈ రెండు సంస్థల ఉమ్మడి వాటా 67%. వీటి విక్రయాల ద్వారా పరిశ్రమ ప్రగతిని తేలిగ్గా అంచనా వేయొచ్చు. మొత్తం విక్రయాల వృద్ధి కన్నా గ్రామీణ ప్రాంతాల్లో అధిక వృద్ధి నమోదైంది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో మారుతీ 1,34,624 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,04,059తో పోలిస్తే 30% అధికం. మరోవంక దేశ వ్యాప్తంగా మారుతీ కార్ల విక్రయాల్లో వృద్ధి 14 శాతమే.

ఈ ఏడాది వర్షపాతం 98%గా ఉంటుందంటూ గత నెలలో భారత వాతావరణ విభాగం తన అంచనాలను సవరించడం తెలిసిందే. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్‌ మెరుగైందని, జూన్‌ త్రైమాసిక విక్రయాల్లో వృద్ధి గణాంకాలు తమ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని మారుతీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక హ్యుందాయ్‌ ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 18,337 కార్లను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 14,879తో పోలిస్తే 23% అధికం. అయితే ఇదే త్రైమాసికంలో మొత్తం మీద భారత మార్కెట్లో హ్యుందాయ్‌ కార్ల విక్రయాల్లో వృద్ధి 1%లోపే ఉండటం గమనార్హం. మెరుగైన వర్షపాత అంచనాలతో కస్టమర్లలో సెంటిమెంట్‌ బలపడిందని, దీంతో అధిక వృద్ధి నమోదైందని హ్యుందాయ్‌ అంటోంది.

నెట్‌వర్క్‌ విస్తరణపై దృష్టి
గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను గమనించిన ప్రధాన కంపెనీలు తమ రూరల్‌ నెట్‌వర్క్‌ విస్తరణపై దృష్టి పెట్టాయి. కస్టమర్లను చేరుకునేందుకు విక్రయాలు, సేవలకు సంబంధించి సిబ్బందిని నియమించుకుంటున్నాయి. బ్యాంకులతోనూ ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. హ్యుందాయ్‌కు గ్రామీణ ప్రాంతాల్లో 300 ఔట్‌లెట్లున్నాయి. వీటికి అదనంగా కంపెనీ కార్ల విక్రయాల కోసం ఫ్లోట్‌వ్యాన్స్‌ను రంగంలోకి దింపింది. ఈ వ్యాన్లు ఒకే చోట స్థిరంగా ఉండకుండా వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ కార్ల విక్రయాలు చేపడతాయి. ఇక, పండుగల ప్రారంభ సీజన్‌ కావడంతో ఈ క్వార్టర్లోనూ విక్రయాలు మరింత మెరుగ్గా ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. వర్షాకాలం సాగు పనుల నేపథ్యంలో ట్రాక్టర్లకూ, అదే సమయంలో ద్విచక్ర వాహనాలకూ డిమాండ్‌ ఉంటుందని ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆశిస్తోంది.

మరిన్ని వార్తలు