కుబేర భారతం

20 Jun, 2018 00:48 IST|Sakshi

జీఎస్‌టీ అమలైనా సంపద జోరు  

20 శాతం పెరిగిన సంపన్న వ్యక్తులు  

21 శాతం పెరిగిన వారి సంపద  

క్యాప్‌ జెమిని నివేదిక వెల్లడి  

ముంబై: భారత్‌లో కుబేరుల సంఖ్య, వారు కూడబెడుతున్న సంపద పెరుగుతోంది. గత ఏడాది జీఎస్‌టీ అమల్లోకి రావడం వల్ల దేశ ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమైనప్పటికీ, మన దేశంలో డాలర్‌  మిలియనీర్ల సంఖ్య 20 శాతం పెరిగిందని ఫ్రాన్స్‌ టెక్నాలజీ సంస్థ, క్యాప్‌జెమినీ తెలిపింది.

అంతే కాకుండా ఈ డాలర్‌ మిలియనీర్ల సంపద కూడా 20 శాతం పెరిగిందని పేర్కొంది. 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.6.8 కోట్లు ) ఇన్వెస్ట్‌ చేయగల సంపద ఉన్న వారిని ఈ సంస్థ హెచ్‌ఎన్‌ఐగా పరిగణించింది. అపర కుబేరుల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ అవతరిస్తోందంటున్న  ఈ సంస్థ తాజా నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...

  గత ఏడాది భారత్‌లో హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య 20.4 శాతం పెరిగి 2.63 లక్షలకు చేరింది.  
 ఈ హెచ్‌ఎన్‌ఐల సంపద మొత్తం 21 శాతం పెరిగి లక్ష కోట్ల డాలర్లకు పెరిగింది.  
    అంతర్జాతీయంగా చూస్తే, హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 11 శాతం, వారి సంపద 12 శాతం చొప్పున పెరిగాయి. దీంతో పోల్చితే భారత్‌లో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 20 శాతం, వారి సంపద 21 శాతం చొప్పున వృద్ధి చెందాయి.  
 ప్రపంచంలో అతి పెద్ద హెచ్‌ఎన్‌ఐ మార్కెట్లుగా అమెరికా, జపాన్, జర్మనీ, చైనాలు నిలిచాయి. ఈ జాబితాలో మన దేశం 11వ స్థానంలో ఉంది.  
 భారత్‌లో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య, వారి సంపద బాగా పెరగడానికి ప్రధాన కారణం స్టాక్‌ మార్కెట్‌ బాగా పెరగడమే. గత ఏడాది స్టాక్‌ మార్కెట్‌ 50 శాతానికి పైగా వృద్ధి సాధించింది. .  
73 శాతం సంపద 1 శాతం చేతిలో..
   గత ఏడాది సృష్టించబడిన మొత్తం సంపదలో 73 శాతాన్ని 120 కోట్ల మొత్తం భారతీయుల్లో కేవలం 1 శాతం జనాభా మాత్రమే చేజిక్కించుకున్నారని అంతర్జాతీయ హక్కుల సంస్థ, ఆక్స్‌ఫామ్‌ ఈ ఏడాది జనవరిలో పేర్కొంది. మొత్తం భారతీయుల్లో సగానికి పైగా ఉన్న 67 కోట్ల మంది భారతీయుల సంపద కేవలం 1 శాతం మాత్రమే పెరిగిందని ఈ సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు