చక్కెర ఎగుమతులు వద్దు

26 Mar, 2014 06:44 IST|Sakshi
చక్కెర ఎగుమతులు వద్దు

న్యూఢిల్లీ: దేశంలో పంచదార ఉత్పత్తి, డిమాండు సమీప భవిష్యత్తులోనే సమాన స్థాయికి చేరతాయనీ, కనుక చక్కెర ఎగుమతులకు భారత్ స్వస్తి చెప్పాలనీ హెచ్‌ఎస్‌బీసీ వ్యాఖ్యానించింది. ‘ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తులు’ పేరుతో నిర్వహించిన సర్వే వివరాలను సంస్థ వెల్లడించింది. ‘భారత్‌లో పంచదార ఉత్పత్తి వ్యయం ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటికే ఎక్కువగా ఉంది. ఇండియా కంటే బ్రెజిల్‌లో ఉత్పత్తి వ్యయం 40 శాతం తక్కువ. అందుకే గత రెండు దశాబ్దాల్లో బ్రెజిల్ నుంచి చక్కెర ఎగుమతులు భారీగా పెరిగాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఇండియాలో ఉత్పత్తయ్యే పంచదార దేశీయ వినియోగానికే సరిపోతుంది. ఒకప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరల విషయంలో ఇండియా నిర్ణయాత్మక పాత్ర పోషించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు...’ అని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది.

 ‘పంచదార ధరలు పెరగ్గానే భారతీయ రైతులు చెరకు పంట వేస్తారు. దాంతో అప్పటిదాకా చక్కెర దిగుమతులపై ఆధారపడే భారత్, ఆ వెంటనే ఎగుమతిదారుగా ఆవిర్భవిస్తుంది. ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గగానే మిల్లర్ల మార్జిన్లు తగ్గడమే కాకుండా రైతులకు చెల్లింపులు ఆలస్యమవుతాయి. దీంతో రైతులు ఇతర పంటలవైపు మళ్లుతారు. ఫలితంగా ఇండియా మళ్లీ పంచదారను దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో ఇప్పటికే అనేక చక్కెర మిల్లులు అతి తక్కువ మార్జిన్లతో, లేదంటే నష్టాలతో నడుస్తున్నాయి. చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా రికార్డు స్థాయిలకు చేరాయి...’ అని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక పేర్కొంది.

 8.5 శాతం తగ్గిన ఉత్పత్తి ...
 చెరకు అధికంగా సాగుచేసే రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడంతో ఈ ఏడాది మార్చి 15 నాటికి దేశంలో పంచదార ఉత్పత్తి 8.5 శాతం క్షీణించి 19.38 మిలియన్ టన్నులకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో ఉత్పత్తి 21.10 మిలియన్ టన్నులుగా ఉందని భారతీయ చక్కెర మిల్లుల సంఘం (ఇస్మా) తెలిపింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం (అక్టోబర్ - సెప్టెంబర్) మొత్తమ్మీద ఉత్పత్తి అంచనాను 5 శాతం తగ్గించినట్లు సంఘం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గిపోతోంది. చెరకును అత్యధికంగా పండించే మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఇప్పటి వరకు పంచదార ఉత్పత్తి తక్కువ స్థాయిలో ఉంది.

 గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నెల 15 నాటికి మహారాష్ట్రలో 6.41 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. 2013 మార్చి 15 నాటికి ఆ రాష్ట్రంలో 7.33 మిలియన్ టన్నులు ఉత్పత్తి కావడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఉత్పత్తి 5.89 మిలియన్ టన్నుల నుంచి 5.07 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్పత్తి 4% క్షీణించి 8.80 లక్షట టన్నులకు చేరింది. గత అక్టోబర్ - ఫిబ్రవరి మధ్యకాలంలో దేశంలో 11 లక్షల టన్నుల ముడి పంచదార ఉత్పత్తి కాగా ఆరు లక్షల టన్నులు ఎగుమతి అయింది..’ అని ఇస్మా వివరించింది.

మరిన్ని వార్తలు