పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్‌

10 Oct, 2019 05:53 IST|Sakshi

అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో 68వ స్థానం

క్రితం ఏడాది 58వ స్థానం

నంబర్‌ 1 స్థానానికి సింగపూర్‌

రెండో స్థానానికి వెళ్లిన∙అమెరికా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్‌ వెనుకబడింది.  అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన ‘గ్లోబల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌’లో క్రితం ఏడాది 58వ స్థానంలో నిలిచిన భారత్, ఈ ఏడాది 68కి పరిమితమైంది. ప్రధానంగా ఇతర ఆర్థిక వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉండడం భారత్‌ వెనక్కి వెళ్లిపోవడానికి కారణం. కొలంబియా, దక్షిణాఫ్రికా, టర్కీ తమ స్థానాలు మెరుగుపరుచుకుని భారత్‌ను అధిగమించినట్టు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది.

అంతర్జాతీయంగా అత్యంత పోటీపడగల ఆర్థిక వ్యవస్థగా సింగపూర్‌ అవతరించి ఆశ్చర్యపరించింది. ఈ విషయంలో అమెరికా స్థానాన్ని కొల్లగొట్టింది. బ్రిక్స్‌లోని ఐదు దేశాల్లో భారత్, బ్రెజిల్‌ ఆర్థిక వ్యవస్థల ర్యాంకులే తక్కువగా ఉండడం గమనార్హం. ఈ సూచీలో బ్రెజిల్‌ 71వ స్థానంలో ఉంది. అయితే, స్థూల ఆర్థిక అంశాల పరంగా స్థిరత్వం, మార్కెట్‌ సైజు పరంగా భారత్‌ ర్యాంకు ఉన్నత స్థానంలోనే ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. వాటాదారుల గవర్నెన్స్‌ విషయంలో అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలిచింది. 103 అంశాల ఆధారంగా గ్లోబల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌లో స్థానాలను డబ్ల్యూఈఎఫ్‌ ఏటా నిర్ణయిస్తుంటుంది. మొత్తం 141 దేశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటుంది. 

మరిన్ని వార్తలు