జీడీపీలో 7కు తగ్గిన భారత్‌ ర్యాంక్‌

3 Aug, 2019 05:22 IST|Sakshi

ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల విడుదల

భారత్‌ కంటే ముందుకెళ్లిన బ్రిటన్, ఫ్రాన్స్‌

2017లో ఆరో స్థానం

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్‌ ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి దిగజారింది. 2018లో జీడీపీ పరంగా 2.72 ట్రిలియన్‌ డాలర్ల పరిమాణంతో బ్రిటన్, ఫ్రాన్స్‌ల తర్వాత స్థానానికి వెళ్లింది. టాప్‌ 6 దేశాల్లో... అమెరికా (20.5 ట్రిలియన్‌ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్‌ డాలర్లు), జపాన్‌ (4.9 ట్రిలియన్‌ డాలర్లు), జర్మనీ (3.9 ట్రిలియన్‌ డాలర్లు), బ్రిటన్‌ (2.82 ట్రిలియన్‌ డాలర్లు), ఫ్రాన్స్‌ (2.77 ట్రిలియన్‌ డాలర్లు) భారత్‌ కంటే ముందున్నాయి. 2024 నాటికి జీడీపీని 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. 2017లో భారత్‌ ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. స్వల్ప తేడాతో బ్రిటన్‌ను కూడా దాటేసింది.

2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటే, బ్రిటన్‌ జీడీపీ 2.64 ట్రిలియన్‌ డాలర్లు, ఫ్రాన్స్‌ జీడీపీ 2.59 ట్రిలియన్‌ డాలర్లకే పరిమితం కాగా, తిరిగి 2018లో భారత్‌ను దాటి ఈ రెండు దేశాలు ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి( 5.8%) పడిపోవడం గమనార్హం. 2018–19 సంవత్సరానికి కూడా జీడీపీ 6.8%కి క్షీణించింది. కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గులు, జీడీపీ వృద్ధి నిదానించడం అంతర్జాతీయ జీడీపీ ర్యాంకుల్లో భారత్‌ కిందకు రావడానికి కారణాలుగా ఈఅండ్‌వై ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. ఎగుమతులు తగ్గడం, డిమాండ్‌ పడిపోవడం వంటి పరిస్థితులను గుర్తు చేశారు. వృద్ధి తిరిగి గాడిన పడాలంటే ద్రవ్య ప్రోత్సాహకాలు అవసరమని అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు