స్మార్ట్‌ఫోన్‌కు ‘కరోనా’ ముప్పు

4 Apr, 2020 04:38 IST|Sakshi

2 బిలియన్‌ డాలర్ల మేర నష్టం

మార్చి, ఏప్రిల్‌లో విక్రయాల తగ్గుదల

కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ అంచనా

న్యూఢిల్లీ: కరోనావైరస్‌ మహమ్మారి కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో దేశీ స్మార్ట్‌ఫోన్స్‌ పరిశ్రమ తీవ్రంగా నష్టపోనుంది. ఇది సుమారు 2 బిలియన్‌ డాలర్ల మేర ఉండొచ్చని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్‌లో విక్రయాలు గణనీయంగా మందగించడం ఇందుకు కారణంగా ఉంటుందని పేర్కొంది. మార్చి మధ్య దాకా కరోనా మహమ్మారి ప్రభావం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ అనివార్యమైందని వివరించింది.

దీని ఫలితంగా 2020లో స్మార్ట్‌ఫోన్ల విక్రయం గతేడాది నమోదైన 15.8 కోట్లతో పోలిస్తే 3 శాతం తగ్గి 15.3 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మార్చిలో 27 శాతం తగ్గనుండగా, ఏప్రిల్‌ 14 దాకా లాక్‌డౌన్‌ కొనసాగితే ఈ నెలలో దాదాపు 60 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ తెలిపారు. కరోనా వైరస్‌ మహమ్మారికి మూలకేంద్రమైన చైనా నుంచి విడిభాగాల సరఫరా దెబ్బతినడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు తీవ్రంగా ఇబ్బందిపడ్డాయి.  

లాక్‌డౌన్‌ పెంచితే మరింతగా నష్టాలు..
ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగించిన పక్షంలో నష్టాలు మరింత పెరగవచ్చని పాఠక్‌ చెప్పారు. మొత్తం సరఫరా వ్యవస్థ, ఆదాయాలు, చెల్లింపులు మొదలైనవన్నీ దెబ్బతినడమే ఇందుకు కారణమన్నారు. పైపెచ్చు వినియోగదారులు ఎక్కువగా పొదుపునకు ప్రాధాన్యమిచ్చి, కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం వల్ల డిమాండ్‌ పడిపోవచ్చని పాఠక్‌ వివరించారు. భారత్‌ను ఎగుమతుల హబ్‌గా చేసుకున్న ఫ్యాక్టరీలపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే, పరిస్థితి మెరుగైతే ఉత్పత్తిని వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఫ్యాక్టరీలు.. ఉద్యోగాల్లో కోతలు విధించడానికి మొగ్గు చూపకపోవచ్చన్నారు.

పండుగల సీజన్‌ దాకా ఇంతే..
ఈ ఏడాది ద్వితీయార్థానికి గానీ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్‌ ఉండకపోవచ్చని పాఠక్‌ చెప్పారు. ‘ఈ ఏడాది మధ్య నాటికి పరిస్థితి మెరుగుపడినా కూడా.. పండుగల సీజన్‌ దాకా వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి సాధారణ స్థాయికి తిరిగొస్తే .. ఆన్‌లైన్‌ విక్రయాలూ మెరుగుపడొచ్చన్నారు. ఆఫ్‌లైన్‌ విక్రేతలకు ఆకర్షణీయ ఆఫర్లివ్వడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ స్టాక్స్‌ సత్వరం అందుబాటులో ఉంచేందుకు స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ప్రయత్నిస్తాయని చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా