ఒకే జీఎస్‌టీ రేటు ఉండాలి..

30 Jan, 2020 04:41 IST|Sakshi

ఎఫ్‌ఎంసీజీ రంగం డిమాండ్‌

అధిక నిరుద్యోగిత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్వల్పంగా అధికమైన ఆదాయాల స్థాయి.. వెరసి పట్టణ డిమాండ్‌కు అడ్డుకట్ట పడుతోంది. డిమాండ్‌ తిరిగి గాడినపడాలని ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు కోరుతున్నాయి. బడ్జెట్‌లో ప్రకటించబోయే ఉద్దీపనలపైనే ఇది ఆధారపడి ఉందని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయపు పన్ను శ్లాబు సవరణ, ఉద్యోగాల కల్పన, గ్రామీణ కస్టమర్లకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందజేస్తే ప్రజల చేతుల్లో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.

► ఎఫ్‌ఎంసీజీ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. సరిపడ నగదు లభ్యత లేక చాలా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా సంప్రదాయ వ్యాపారాలు బలహీనపడుతున్నాయి.  
► పంటలకు సరైన ధర, వ్యవసాయేతర ఆదాయాలు తగ్గడం వంటి అంశాల్లో ప్రభుత్వ మద్దతు కొరవడి గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ నిరుత్సాహపరుస్తోంది.  
► భారతావనిలో వినియోగం పరంగా సుమారు 75% గ్రామీణ ప్రాంతమే. ఈ నేపథ్యంలో పంటలకు మద్ధతు ధర, ప్రోత్సాహకాలు కల్పించాలి. దీనివల్ల రైతుల ఆదాయం పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల టర్నోవర్‌ మెరుగవుతుంది.  
► ద్రవ్య సరఫరాను పెంచే విషయంలో ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలకు పూనుకుంది. అయితే డిమాండ్‌ లేకపోవడంతో ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. మందగమనం నుంచి గట్టెక్కడానికి ఖర్చుచేయతగ్గ ఆదాయం పెరగాలంటే పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి.
► విక్రయాలు తిరిగి పుంజుకుంటే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సామర్థ్యం పెంపుపై పెట్టుబడులు చేస్తాయి. నియామకాలను చేపడతాయి.
► వేతనాలు అధికమైతే సేవింగ్స్‌ పెరుగుతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సంస్కరణలను తేవాలి. పలు రంగాల్లో ఉద్దీపనలు ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించే వాతావరణం కల్పించాలి.
► జీఎస్‌టీ రేట్లను తగ్గించాలి. అదేవిధంగా ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులన్నింటికీ ఒకే పన్ను రేటును అమలు చేయాలి. తయారీపై ప్రణాళికగా వెళ్లేందుకు కంపెనీలకు మార్గం ఏర్పడుతుంది. తయారీ పెరిగితే కింది స్థాయిలో తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలు అధికమవుతాయి.
► ఈ–కామర్స్‌ కంపెనీల కారణంగా సాధారణ బిస్కట్లు, చవక తృణధాన్యాలు, గింజల అమ్మకాలు లేకుండాపోయాయి. వ్యాపారాలు గాడినపడేందుకు చిన్న కిరాణా వర్తకులు, ఎఫ్‌ఎంసీజీ దుకాణదారులకు పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి.  
► మందగమనం నుంచి గట్టెక్కాలంటే వినియోగం పెరగాలి.  కార్పొరేట్‌ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం, పన్ను ఆదాయం తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయంపైనా ఆ మేరకు ప్రభావం చూపుతోంది.  సెంటిమెంటు బలపడడానికి, పన్ను ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సమతులంగా వ్యవహరించాలి.

బడ్జెట్‌పైనే ఆశలన్నీ..!
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆర్థిక మందగమనం, నిరుద్యోగంపై అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉంది. బడ్జెట్‌లో కేటాయింపులు, ప్రాధమ్యాలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం మాత్రమే కాదు, దేశ యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనున్నాయి. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ శాతం పెరిగిపోయి 6.1 శాతంగా నమోదైంది. అలాగే ఉన్న ఉద్యోగులికిచ్చే వేతనాలు కూడా అరకొరగానే ఉంటున్నాయి. అసలే వృద్ధి రేటు తక్కువగా ఉన్న ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్‌ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు పెరిగితే యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

అలాగే కొత్త పెట్టుబడులతో కోల్డ్‌ స్టోరేజీలు, ఆహారశుద్ధి పరిశ్రమలు, లాజిస్టిక్‌ క్లస్టర్ల ఏర్పాటుతో గ్రామీణ నిరుద్యోగాన్ని కొంత తగ్గించే అవకాశం ఉంది. పట్టణాలు, నగరాలలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. రియల్టీ రంగం, నిర్మాణ రంగాలకు ప్రోత్సాహకాలు అందివ్వడం ద్వారా ఆయా రంగాలపై ఆధారపడి ఉన్నవారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మన దేశానికి వరంగా మారిన విద్యావంతులైన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వొకేషనల్‌ ట్రైనింగ్‌ ఇచ్చేందుకు బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించడం ద్వారా వృద్ధి రేటు సాధించడంతోపాటు గణనీయంగా ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ శాతాన్ని తగ్గించవచ్చు.

– శ్రీనుబాబు గేదెల, సీఈఓ, పల్సస్‌ గ్రూప్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా