10% వృద్ధి .. 10 లక్షల కోట్ల డాలర్లు!

22 Apr, 2016 01:45 IST|Sakshi
10% వృద్ధి .. 10 లక్షల కోట్ల డాలర్లు!

2032కి భారత ఎకానమీ అంచనాలు
17.5 కోట్ల ఉద్యోగాల కల్పన
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్

 న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2032 నాటికి 10 శాతం వృద్ధి రేటుతో 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగగలదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. అలాగే 17.5 కోట్ల ఉద్యోగాల కల్పనతో పాటు దారిద్య్ర రేఖ దిగువన  ఉన్నవారి (బీపీఎల్) సంఖ్య సున్నా స్థాయికి తగ్గగలదని ఆయన పేర్కొన్నారు. గురువారం సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అమితాబ్ కాంత్ ఈ మేరకు నీతి ఆయోగ్ అంచనాలను వివరించారు. కీలక అంశాలపై కేంద్రం డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన ఎనిమిది సెక్రటరీల బృందాల (జీవోఎస్) నివేదికల అమలు పురోగతిని కాంత్ వివరించారు.

జీవోఎస్ సిఫార్సుల్లో కొన్ని అమలయ్యాయని, మిగతా వాటి అమలుకు మార్గదర్శ ప్రణాళికను రూపొందించడం జరిగిందని కాంత్ పేర్కొన్నారు. వేగవంతమైన వృద్ధి సాధనకు సంబంధించి 2017 ఆర్థిక సంవత్సరంలో రహదారులు, రైల్వేల్లో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ వ్యవధిలో 10,000 కిలోమీటర్ల దూరం రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాగలదని కాంత్ తెలిపారు. లక్ష్యాలు చాలా భారీవే అయినప్పటికీ అధికారులంతా అంగీకరించిన నేపథ్యంలో ఇవి సాధ్యపడేవేనని ఆయన పేర్కొన్నారు. భారత ఎకానమీ 2015-16లో 7.6 శాతం వృద్ధితో 1.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది.

 ఎనిమిది బృందాల సిఫార్సుల్లో మరికొన్ని..
సమ్మిళితమైన వేగవంతమైన వృద్ధి సాధన, ఉపాధి కల్పన వ్యూహాలు, వైద్యం.. విద్య, గుడ్ గవర్నెన్స్, రైతు సంబంధ అంశాలు, స్వచ్ఛ భారత్.. గంగా నది ప్రక్షాళన, విద్యుత్ పొదుపు, కొంగొత్త బడ్జెటింగ్ విధానాల రూపకల్పన మొదలైన అంశాలపై ఎనిమిది బృందాలు ఏర్పాటయ్యాయి. ఇవి చేసిన సిఫార్సుల్లో మరికొన్ని అంశాలు..

♦ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దారిద్య్ర రేఖకు దిగువన వున్న మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు మంజూ రు చేయాలని, మెడికల్ టూరిజంను ప్రోత్సహించాల ని వైద్యం, ఫార్మాపై ఏర్పాటైన బృందం సూచించింది.

2017 మార్చి నాటికి జాతీయ కెరియర్ సర్వీస్ ద్వారా ఇ-ప్లాట్‌ఫాం విధానంతో అన్ని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజీలను అనుసంధానం చేయడం. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరో 62 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం.

 రహదారులను గడువుకు ముందే పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలిచ్చే విధానాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికల్లా అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వ్యాపారాలను సులభతరం చేసే విషయంపై ఏర్పాటైన బృందం సిఫార్సు చేసింది.

 2016 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 2018 నాటికల్లా అన్ని గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వాలి.

 2020 నాటికి 15 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం సాధించడం. 2017 ఆర్థిక సంవత్సరం నాటికి ఇంధన పొదుపు నిబంధనలను మెరుగుపర్చుకోవడం. విద్యుత్ వినియోగాన్ని తగ్గించే భవంతుల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం. బూడిద వ్యర్ధాలను తగ్గించేందుకు కొత్తగా 15 బొగ్గు వాషరీలను ఏర్పాటు చేయడం.

మరిన్ని వార్తలు