డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భారత్ హల్‌చల్..!

19 Jan, 2015 01:39 IST|Sakshi
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భారత్ హల్‌చల్..!

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 45వ సదస్సుకు భారత్ నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విద్యుత్-బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితర సీనియర్ కేబినెట్ సహచరులతో పాటు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా పాల్గొననున్నారు. ఈ నెల 20-24 వరకూ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ఈ సదస్సుకు 100 మందికిపైగా భారత కార్పొరేట్ దిగ్గజాలు హాజరుకానుండటం గమనార్హం.

జాబితాలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్, టీసీఎస్ సారథి ఎన్. చంద్రశేఖరన్, ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా, అజీమ్ ప్రేమ్‌జీ, సునీల్ మిట్టల్, ఉదయ్ కొటక్, ఆది గోద్రెజ్, నవీన్ జిందాల్, బాబా కళ్యాణి వంటి హేమాహేమీలు ఉన్నారు. సదస్సుకు నేతృత్వం(కో-చైర్స్) వహిస్తున్న ఆరుగురిలో భారత్ నుంచి జుబిలంట్ భర్తియా గ్రూప్ కో-చైర్మన్, వ్యవస్థాపకుడు హరి ఎస్. భర్తియా, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ ష్మిట్ ఉన్నారు.
 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పలు కీలక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో దీన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే ఈసారి సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందుకోసం ‘ద న్యూ గ్లోబల్ కాంటెక్స్ట్’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. కాగా, భారత్‌లో వ్యాపారాలు, రాజకీయాలు, సామాజిక పరిస్థితుల్లో కొత్త నాయకత్వం తీసుకొస్తున్న మార్పులపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడే అవకాశం ఉంది. కాగా, సదస్సులో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు.
 
ప్రపంచ నేతలు, కార్పొరేట్లలో ముఖ్యులు...
జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అద్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, చైనా ప్రధాని లీ కెకియాంగ్, స్విస్ అధ్యక్షుడు సిమెనెటా సొమారుగా, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సహా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన నేతలు హజరవుతున్నారు. మొత్తంమీద 2,500 మందికిపైగా కార్పొరేట్లు, రాజకీయ నాయకులు సందడి చేయనున్నారు.  ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్; డబ్ల్యూటీఓ డెరైక్టర్ జనరల్ రాబెర్టో అజెవెడో, అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాహూ సీఈఓ మారిసా మేయర్, ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ తదితర దిగ్గజాలు హాజరవుతున్నారు.

మరిన్ని వార్తలు