బ్రిక్స్ బ్యాంక్‌కు ఆరేళ్లు భారత్ సారథ్యం

17 Jul, 2014 01:52 IST|Sakshi
బ్రిక్స్ బ్యాంక్‌కు ఆరేళ్లు భారత్ సారథ్యం

ఫోర్టలేజా (బ్రెజిల్): బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంకుకు మొదటి ఆరు సంవత్సరాలు భారత్ అధ్యక్షత వహించనుంది. రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం షాంఘై (చైనా)లో ఉంటుంది. భారత్ తర్వాత బ్రెజిల్, రష్యాలు ఐదేళ్ల చొప్పున సారథ్యం వహిస్తాయని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి.

పాశ్చాత్య దేశాలు పెత్తనం చెలాయిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు బ్యాంకును నెలకొల్పాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల సదస్సు మంగళవారం నిర్ణయించిన సంగతి విదితమే. బ్యాంకుతో పాటు 10 వేల కోట్ల డాలర్లతో ఏర్పాటు చేయనున్న కరెన్సీ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సీఆర్‌ఏ)తో బ్రిక్స్ దేశాలు స్వల్పకాలిక లిక్విడిటీ ఒత్తిడులను తట్టుకోగలుగుతాయి.

ఇండియా మినహా బ్రిక్స్ సభ్య దేశాల పార్లమెంట్లు సీఆర్‌ఏకు ఆమోదముద్ర వేయడానికి ఆరు నెలలు గడువుందని అధికార వర్గాలు తెలిపాయి. సీఆర్‌ఏకు అవసరమైన నిధుల్లో భాగంగా చైనా అత్యధికంగా 4,100 కోట్ల డాలర్లు, ఇండియా, రష్యా, బ్రెజిల్‌లు 1,800 కోట్ల డాలర్ల చొప్పున, దక్షిణ ఆఫ్రికా 500 కోట్ల డాలర్లు అందించనున్నాయి. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చర్చించిన డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇపుడు వాస్తవరూపం దాల్చిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలతో పాటు ఇతర వర్థమాన దేశాలకు సైతం ఈ బ్యాంకు సహకరిస్తుందని తెలిపారు.

 పారిశ్రామిక రంగం హర్షం...:  బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటుతో సభ్యదేశాల మధ్య ఆర్థిక సహకారం వృద్ధిచెందుతుందని భారతీయ పారిశ్రామికరంగం హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలను అధిగమించడానికి, మౌలిక సౌకర్యాల వృద్ధికి బ్యాంకు దోహదపడుతుందని పేర్కొంది. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు చరిత్రాత్మకమని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ్ బిర్లా అభివర్ణించారు. బ్యాంకు ఏర్పాటు ఇండియా సాధించిన విజయమని అన్నారు. వర్థమాన ఆర్థిక వ్యవస్థల పురోగతికి భారీగా నిధులు అవసరమనీ, 10 వేల కోట్ల డాలర్ల కంటే మరిన్ని రెట్ల నిధుల సమీకరణ మార్గాలను బ్యాంకు అన్వేషించాలని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ అభిప్రాయపడ్డారు.

 వచ్చే ఏడాది సదస్సు రష్యాలో..
 వచ్చే సంవత్సరం బ్రిక్స్ ఏడో సదస్సును రష్యాలోని ఊఫా నగరంలో నిర్వహించనున్నారు. సదస్సు నిర్వహణకు ముందుకొచ్చిన రష్యాను భారత్, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికాలు అభినందించాయి.

మరిన్ని వార్తలు