ఇక లగ్జరీ ఉత్పత్తుల పై కొరడా

24 Jul, 2013 03:31 IST|Sakshi
Luxury Items

న్యూఢిల్లీ: లగ్జరీ వినియోగ వస్తువుల ధరలకు మరింత రెక్కలొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లోకి దిగుమతయ్యే లగ్జరీ కార్లు, అధునాతన సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, టీవీలతో పాటు ఖరీదైన ఆహారోత్పత్తుల రేట్లు షాక్ కొట్టనున్నాయి. విలాసాలకు వినియోగించే ఇటువంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుండటమే దీనికి కారణం. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడం కారణంగా ఇప్పటికే అన్నిరకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, కార్ల ధరలు భారీగా ఎగబాకిన సంగతి తెలిసిందే.
 
 బంగారమే ఆదర్శంగా...
 ఎగుమతులు పడిపోవడం, మరోపక్క దిగుమతులు దూసుకెళ్తుండటంతో దేశ కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) రికార్డు గరిష్టానికి ఎగబాకి ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే పాతాళానికి పడిపోయిన రూపాయిని అధిక క్యాడ్ మరింత దెబ్బతీస్తోంది. దీంతో ఈ లోటును కట్టడి చేసేందుకు  ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. దిగుమతుల్లో అత్యధిక వాటా ఉన్న బంగారం డిమాండ్‌ను తగ్గించేందుకు ఇప్పటికే అనేకసార్లు దిగుమతి సుంకాన్ని పెంచేయడం తెలిసిందే. పుత్తడి దిగుమతి సుంకం 2 శాతం స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా 8 శాతానికి చేరింది. మరోపక్క, బంగారం దిగుమతికి కళ్లెం వేసేందుకు ఆర్‌బీఐ కూడా ఇప్పటికే అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది కూడా. ఈ చర్యలు కొంత సానుకూల ఫలితాలే ఇచ్చాయి. మే నెలలో 162 టన్నులుగా ఉన్న పుత్తడి దిగుమతులు జూన్‌లో 31 టన్నులకే పరిమితమైనట్లు అంచనా. ఇప్పుడు ఇదే విధమైన చర్యల ద్వారా లగ్జరీ ఉత్పత్తుల దిగుమతులను కూడా తగ్గించాలనేది ప్రభుత్వం యోచన.
 
 లోటు బారెడు...: అధిక దిగుమతుల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలానికి వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 50 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లోటు 42.2 బిలియన్ డాలర్లే. ఏప్రిల్-జూన్ వ్యవధిలో భారత్ నుంచి ఎగుమతులు 1.4% క్షీణించగా... దిగుమతులు మాత్రం 6శాతం పెరిగాయి. ఇదిలాఉండగా, క్యాడ్ గత ఆర్థిక సంవత్సరం(2012-13)లో చరిత్రాత్మక గరిష్టానికి(88 బిలియన్ డాలర్లు) ఎగబాకడం అటు ప్రభుత్వం, ఇటు ఆర్‌బీఐకి ముచ్చెమటలు పట్టిస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి తిప్పలు పడుతున్నాయి. దేశంలోకి దిగుమతవుతున్న వస్తువుల్లో పెట్టుబడులకు ఊతమిచ్చేవి కాకుండా వినియోగానికి మాత్రమే పరిమితమవుతున్న ఉత్పత్తులు చాలా ఉన్నాయి. బంగారంతోపాటు ఎలక్ట్రానిక్, లగ్జరీ కార్లు వంటివి ఈ జాబితాలో కొన్ని. వీటి డిమాండ్‌కు కళ్లెం వేయాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. లగ్జరీ  వస్తువులపై దిగుమతి సుంకం పెంపు ప్రతిపాదనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందనేది ఆయా వర్గాల సమాచారం.
 
 ఎలక్ట్రానిక్స్ దిగుమతుల వెల్లువ...
 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీల దిగుమతుల విలువ 2009-10లో 55 కోట్ల డాలర్లు కాగా... 2012-13లో ఇది 160 కోట్ల డాలర్లకు ఎగబాకింది. అంతేకాకుండా మొబైల్ హ్యాండ్‌సెట్లతోపాటు మొత్తం టెలికం పరికరాల దిగుమతులు కూడా గతేడాది 10 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. మొబైల్ ఫోన్‌లపై ప్రస్తుతం 6% దిగుమతి సుంకం(కౌంటర్‌వెయిలింగ్ సుంకం) అమలవుతోంది. ఇక ల్యాప్‌లాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లపై ఈ సుంకం 12 శాతంగా ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌లో హైఎండ్ మోటార్ వాహనాలు, బైక్స్, విలాసవంతమైన ఓడలు(యాట్స్) దిగుమతి సుంకాన్ని ఏకంగా 25 శాతం పెంచారు. దీంతో ఇది 75% నుంచి 100 శాతానికి చేరింది.
 
 ఈ మంత్రం పనిచేస్తుందా?
 క్యాడ్‌ను తగ్గించడం, మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోపెట్టడానికి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించాలే తప్ప ఇటువంటి స్వల్పకాలిక చర్యల వల్ల ప్రయోజనం అంతంతమాత్రమేనని ఆర్థికవేత్తలు అంటున్నారు. సుంకాలను పెంచి దిగుమతులను కట్టడి చేయడం వల్ల కేవలం స్వల్పకాలిక ఊరట మాత్రమే లభిస్తుందని క్రిసిల్ చీఫ్ ఎరనమిస్ట్ డీకే జోషి అభిప్రాయపడ్డారు. దీనికంటే ఎగుమతులను పెంచడంపై మరింత దృష్టిసారిస్తే మంచిదని పేర్కొన్నారు. మరోపక్క, అధిక సుంకాల కారణంగా ధరలు పెరిగినా లగ్జరీ ఉత్పత్తుల దిగుమతులేవీ తగ్గే అవకాశాలు లేవని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించే వినియోగదారులు ఎంతైనా చెల్లిం చేందుకు వెనుకాడకపోవడమే దీనికి కారణనేది వాళ్ల వాదన.
 

మరిన్ని వార్తలు