శ్రీమంతులు పెరిగారు!

6 Mar, 2020 06:23 IST|Sakshi

ప్రస్తుతం దేశంలో యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ సంఖ్య 5,986

2024 నాటికి 73 శాతం వృద్ధితో 10,534కు చేరిక

ఈక్విటీలే ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్స్‌; ఆ తర్వాత బాండ్లు, రియల్టీలో..  అత్యంత ఖరీదైన నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు

గ్లోబల్‌ నైట్‌ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌–2020 వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హైనెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్య వేగంగా పెరుగుతోంది. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, మందగించిన ఆర్థికాభివృద్ధి వంటివి శ్రీమంతుల సంపద వృద్ధికి విఘాతాన్ని కలిగించడం లేదు. ప్రస్తుతం మన దేశంలో 5,986లుగా ఉన్న యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంఖ్య.. 2024 నాటికి 73 శాతం వృద్ధితో 10,354లకు చేరుతుందని నైట్‌ఫ్రాంక్‌ అంచనా వేసింది. రూ.220 కోట్లకు పైగా నికర సంపద ఉన్న వాళ్లని యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐగా పరిగణించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అల్ట్రా శ్రీమంతులున్న దేశం అమెరికా. ఇక్కడ 2,40,575 మంది యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలుంటే.. చైనాలో 61,587 మంది, జర్మనీలో 23,078 మంది ఉన్నారు. నైట్‌ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌–2020లోని పలు ఆసక్తికర అంశాలివే..

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన నగరం న్యూయార్క్‌. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లండన్, పారిస్‌ నగరాలు నిలిచాయి. మన దేశం నుంచి ముంబై 44వ స్థానంలో, ఢిల్లీ 58, బెంగళూరు 89వ స్థానంలో నిలిచాయి. 2024 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంపద కలిగిన కేంద్రంగా ఆసియా నిలుస్తుందని, ఐదేళ్ల వృద్ధి అంచనా 44 శాతం ఉంటుందని నివేదిక తెలిపింది. ఆసియాలో చూస్తే.. 73 శాతం వృద్ధితో ఇండియా మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో 64 శాతంతో వియత్నాం, 58 శాతంతో చైనా, 57 శాతం వృద్ధితో ఇండోనేషియా దేశాలుంటాయని రిపోర్ట్‌ పేర్కొంది. ‘‘ఇండియా ఆర్థికాభివృద్ధికి పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యేనని.. ఇదే సంపద సృష్టికి సహాయపడుతుందని నైట్‌ఫ్రాంక్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ శిషీర్‌ బైజాల్‌ తెలిపారు. ప్రపంచ ఉత్పత్తులు, సేవలకు ఇండియా ప్రధాన మార్కెట్‌గా మారిందని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలకు ఉత్పాదక కేంద్రంగా భారత్‌ అవతరించిందని పేర్కొన్నారు.

ఈక్విటీలే ప్రధాన పెట్టుబడులు..
మన దేశంలోని మొత్తం యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలలో 83% మంది ఈక్విటీల్లో, 77 శాతం మంది బాండ్లలో, 51% మంది ప్రాపర్టీల్లో పెట్టుబడులు ఆసక్తిగా ఉన్నారు. 2019లో యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ విభాగాల వారీగా చూస్తే.. 29% ఈక్విటీల్లో, 21% బాండ్లలో, 20% రియల్‌ ఎస్టేట్‌లో, 7% బంగారం, ఇతర ఆభరణాల్లో పెట్టుబడులు పెట్టారు.

మరిన్ని వార్తలు