మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!

23 Jun, 2020 04:02 IST|Sakshi

జీడీపీలో 1% మేర ప్రకటించే అవకాశం

ఫిచ్‌ అంచనాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పరిణామాలతో దెబ్బతిన్న భారత ఎకానమీకి ఊతమిచ్చే విధంగా కేంద్రం మరో దఫా ఆర్థిక ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ సోమవారం తెలిపింది. ఈ విడత ప్యాకేజీ పరిమాణం.. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 1 శాతం మేర ఉండవచ్చని అంచనా వేసింది. భారత సార్వభౌమ రేటింగ్‌ అవుట్‌లుక్‌ ను ఫిచ్‌ గతవారమే స్టేబుల్‌ (స్థిర) నుంచి నెగటివ్‌ (ప్రతికూల) స్థాయికి డౌన్‌గ్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదనంగా ప్రకటించబోయే ఉద్దీపనలను కూడా పరిగణనలో తీసుకున్నట్లు ఫిచ్‌ డైరెక్టర్‌ (సావరీన్‌ రేటింగ్స్‌) థామస్‌ రూక్‌మాకర్‌ తెలిపారు. ‘భారత్‌ జీడీపీలో 10 శాతం స్థాయిలో ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో ద్రవ్యపరమైన చర్యలు .. జీడీపీలో 1 శాతం మేర ఉంటాయి.

మిగతా 9 శాతం అంతా ద్రవ్యేతర చర్యలే. ఇవి కాకుండా బాండ్ల జారీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వీటిని బట్టి చూస్తే కష్టకాలంలో ఉన్న వర్గాలకు మరికాస్త తోడ్పాటు అందించే దిశగా కేంద్రం ఇంకో విడతగా జీడీపీలో 1 శాతం స్థాయిలో మరో దఫా ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకునే భారత రేటింగ్‌పై అంచనాలను ప్రకటించాం’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన రూ. 21 లక్షల ఆర్థిక ప్యాకేజీలో ప్రభుత్వపరమైన ఉద్దీపనతో పాటు ఆర్‌బీఐ ద్రవ్యపరంగా ప్రకటించిన చర్యలు కూడా ఉన్నాయి. 2020–21 బడ్జెట్‌ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ నుంచి సమీకరించే నిధుల లక్ష్యాన్ని రూ. 7.8 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచింది.

అంచనాల కన్నా తక్కువే వృద్ధి..
స్వల్పకాలికంగా భారత వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.5–7% కన్నా మరికాస్త తక్కువగానే ఉండవచ్చని రూక్‌మాకర్‌ తెలిపారు. ‘మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు ఊహించిన దానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చు. అయితే, ఎంత స్థాయిలో తగ్గవచ్చన్నది ఇప్పుడే చెప్పలేము. రుణాల చెల్లింపులపై విధించిన మారటోరియం ఎత్తివేశాక ఆర్థిక రంగ సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది’ అని చెప్పారు. రాబోయే రోజుల్లో వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు సంస్కరణలు ఊతం ఇవ్వనున్నప్పటికీ, వ్యాపార.. ఆర్థిక రంగాలపై కరోనా ప్రభావం మీద ఇది ఆధారపడి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు